తెలంగాణ టీడీపీకి గుడ్‌బై చెప్పి తన రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి మరోమారు కీలక నిర్ణయం తీసుకోనున్నారా? త్వరలో ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెబెల్స్‌గా మారి సొంత పార్టీకే చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మరోవైపు సికింద్రాబాద్ టికెట్ కోసం హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఏకంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నివాసం ముందు ధర్నాకు దిగడం గమనార్హం. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బ్యాచ్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉందనే వార్తలు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా రేవంత్ రెడ్డి టీంకు చెందిన నాయకులు నిర్వహించిన సమావేశం కలకలం సృష్టిస్తోంది. బంజారాహిల్స్‌లో రహస్యంగా సమావేశం అయ్యారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ నేతృత్వంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంపై బోడ జనార్దన్ స్పందిస్తూ తెలంగాణ కాంగ్ర్రెస్ పెద్దలు పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కారని, సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాశనానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తామంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని బోడ జనార్దన్ తెలిపారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా నిన్నకాక మొన్న పార్టీలో చేరి ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుమన్నారు. సిర్పూర్, చెన్నూరు, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం బాధాకరమని బోడ జనార్దన్ అన్నారు.