సీట్ల పంపకానికి ముందే విపక్ష కూటమి బీటలు వారుతోంది. కాంగ్రెస్ నాన్చివేత ధోరణిపై భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో లాభమేమీ లేదని పార్టీలు నిర్ధారణకు వచ్చాయి. సీట్ల పంపకం చాలా ఆలస్యమైందని సీపీఐ, టీజేఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే విలువైన అవకాశం కోల్పోయామని సీపీఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో పోటీ చేయదలుచుకున్న 9 స్థానాలను సీపీఐ ప్రకటించింది.
డిమాండ్ చేసిన స్థానాలు ఇవ్వకుంటే కూటమికి గుడ్‌బై చెప్పే యోచనలో సీపీఐ ఉంది. మరోవైపు పార్క్ హయత్‌లో జరిగిన సమావేశం నుంచి తెలంగాణ జనసమితి నేత కోదండరాం వాకౌట్ చేశారని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తమను తీవ్రంగా అవమానిస్తోందని భావిస్తూ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా నలుగురు ఏఐసీసీ సెక్రటరీలు, పార్టీ సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, మధు యాస్కీ గౌడ్ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారని ప్రచారం జరిగింది.ఈ వార్త మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు.
పరువు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కోదండరాం మధ్యలో వెళ్లిపోయారన్నది నిజం కాదని, కోదండరాంతో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని అసంతృప్తిని కవర్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ పార్టీ నేతలతో చర్చించి చెబుతానని కోదండరాం పేర్కొంటూ చర్చలు ముగిసిన తర్వాతనే వెళ్లిపోయారని వివరించారు. మహాకూటమి నుండి ఏ పార్టీ బయటకు వెళ్ళదన్నారు. కూటమిగానే ఎన్నికలకు వెళతామని తెలిపారు. జనసమితి, సీపీఐ సీట్లపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, సీట్లపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కూడా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశం కోసం మంగళవారం ఢిల్లీకి వెళుతున్నానని ఆయన వివరించారు