తెలంగాణలో ప్రతిపక్షాలు ఏర్పాటుచేసుకున్న మహాకూటమి చీలిక దిశగా సాగుతోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్నా… సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఓ అధికారిక ప్రకటన రాలేదు.అయితే, టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం మాత్రం సాగుతోంది. కానీ క్లారిటీ రాకపోవడంతో…ఆ పార్టీ నేతలు తీవ్రంగా మథనపడుతున్నారు. పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరీ పొత్తుపెట్టుకుంటే..కాంగ్రెస్ తమకు అవమానాన్నే మిగిల్చిందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశంలో ఇదే చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మాకు బలం ఉన్న సీట్లే అడుగుతున్నామంటున్న నేతలు… అందుకు కూడా కాంగ్రెస్ ఒప్పుకోకపోవడం ఏమిటని పార్టీ నేతలను ప్రశ్నించినట్లు సమాచారం.
గత ఎన్నికల్లో వచ్చిన సీట్లే ఉదాహరణగా చూపుతున్నారు. గత ఎన్నికల్లో తాము గెలిచిన సీట్లపై కాంగ్రెస్ ఆలోచించాల్సిన అవసరం లేదని, అయినా కాంగ్రెస్ తమ ప్రతిపాదనలు లైట్ తీసుకోవడం చిత్రంగా ఉందని వాపోయారు.కాగా, కాంగ్రెస్ పార్టీ కూటమికి గుడ్ బై చెప్పాలని కొందరు నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే, కాంగ్రెస్ పార్టీ తమను తీవ్రంగా అవమానిస్తోందని భావిస్తూ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా నలుగురు ఏఐసీసీ సెక్రటరీలు, పార్టీ సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, మధు యాస్కీ గౌడ్ సమావేశానికి టీడీపీ హాజరుకాలేదని సమాచారం. తమ సీట్ల విషయంలో కొంత స్పష్టత ఉన్న కారణంగా హాజరుకాబోమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమావేశానికి హాజరు కాలేదు. కాగా, కూటమిని గుడ్ బై చెప్పేందుకు ఇదే సిగ్నల్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.