మహాకూటమిలో సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. సీట్ల పంపకాలపై చర్చించేందుకు అంటూ సాగదీత సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఈ క్రమంలో సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కి తెచ్చినప్పటికీ…అనూహ్యమైన షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌తో పొత్తు అంటే ఎలా ఉంటుందో…తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాంకు తెలియజెప్పింది. టీజేఎస్ పార్టీకి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే, ఆ స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందంటూ మెలిక పెట్టినట్టు సమాచారం.
దీంతో టీజేఎస్ నేతల మైండ్ బ్లాంక్ అయినట్లు తెలుస్తోంది.విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వర్ధన్నపేట, ఆసిఫాబాద్, రామగుండం, చాంద్రాయణగుట్ట, సిద్దిపేట, దుబ్బాక, మెదక్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్ గిరి, స్టేషన్ ఘనపూర్ లేదా చెన్నూరు స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే సీట్లపై జనసమితి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డిలో సీట్లు లేకపోవడంపై టీజేఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి స్నేహపూర్వక పోటీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమనీ టీజేఎస్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.