మేధావుల చర్చా వేదికలో వక్తల వెల్లడి
రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలంటే రాజకీయ, సామాజిక, ఆర్ధిక విధానాల్లో మార్పు రావాలని పలువురు వక్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. స్థానిక సిల్వర్ గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సాయంత్రం ” వై ఏపీ నీడ్స్ చేంజ్ ” అనే అంశంపై ఎన్నారైలు చర్చా వేదిక నిర్వహించారు. చర్చలో వివిధ వర్గాల నుంచి పాల్గొన్న మేథావులు, నాయకులు మాట్లాడుతూ కేవలం అధికార మార్పిడితో ఒరిగేదేమీ లేదని చెప్పారు. ఆహార భద్రత, వ్యవసాయం, విద్య వైద్య రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు, జోక్యం పెరగాలని అభిలాషించారు. ప్రస్తుత తెలుగు దేశం ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయినట్లు తెలిపారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఉండాలని కోరారు. కేంద్రంలోని బీజేపీతో కఠిన వైఖరి అవలంభించడం లేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు పారదర్శక కార్యాచరణను వైఎస్సార్సీపీ ప్రకటించాలన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, స్థానిక సంస్థల నిర్వీర్యం చేయడంపై వక్తలు తీవ్రంగా విమర్శించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ను పక్కాగా అమలు చేయాలని కోరారు. చర్చావేదికకు కేంద్ర సర్వీసుల రిటైర్డ్ ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఎన్నారై హర్షవర్ధన్ రెడ్డి, సీపీఐ నాయకులు ఎం.వెంకయ్య, జిల్లా అభివృద్ధి వేదిక నాయకులు చుండూరు రంగారావు, కొమ్మూరి కనకారావు, టీ. గోపాలరెడ్డి, వరప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ జేసీ సంషేర్ అహ్మద్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి గౌరి శంకర్, రిమ్స్ వైద్యులు సునీత, మోహన్, బడుగు కోటేశ్వరరావు, అమర్నాథరెడ్డి పాల్గొన్నారు.