కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో రాజుకున్న కుంపటి సెగ గాంధీభవన్‌ను తాకింది. తమ స్థానాలను కూటమిలోని ఇతర పక్షాలకు ఇస్తే సహించేది లేదం టూ కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్ననేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు ఇంకా సీటు ఖరారుకాక ముందే శేరిలింగంపల్లి టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. భవ్యా గ్రూప్స్ అధినేత ఆనంద్‌ప్రసాద్ బైక్ ర్యాలీని మొవ్వా సత్యనారాయణ వర్గం అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీట్ల పంపకాలు ఇంకా పూర్తికానప్పటికీ.. తమ స్థానాలను ఇతర పార్టీలకు కేటాయిస్తారనే ప్రచారంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ఆలస్యంచేస్తే తమస్థానాలు కోల్పోవడం ఖాయమని భావించిన ఆశావహులు గాంధీభవన్‌పై దండయాత్ర చేస్తున్నారు. ఆదివారం గాంధీభవన్‌తోపాటు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసం వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
శనివారం మిర్యాలగూడలో జానారెడ్డి సమక్షంలో పార్టీలో ఇరువర్గాల గొడవ సద్దుమణగకముందే.. తాజాగా శేరిలింగంపల్లి, పెద్దపల్లి నియోజకవర్గాల ఆశావహులు తమ అనుచరులతో గాంధీభవన్ వేదికగా ధర్నాకు దిగడంతో కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుతున్నది. శేరిలింగంపల్లి టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌కే కేటాయించాలంటూ గాంధీభవన్ ఎదురుగా ఓ కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. మరొకరు చేయికోసుకుని నిరసన తెలిపారు.
శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించిన మాజీఎమ్మెల్యే ఎం భిక్షపతియాదవ్ గాంధీభవన్ వేదికగా నిరసన గళంఎత్తారు. టిక్కెట్ తనకే వస్తుందని రెండునెలలుగా ముమ్మరంగా ప్రచారం చేసిన ఆయన శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయిస్తున్నారనే ప్రచారంతో ఆదివారం తన కుమారుడు, యూత్‌కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, ఇతర ముఖ్యనేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలతో గాంధీభవన్ ఎదుట బైఠాయించారు.
శేరిలింగంపల్లి టిక్కెట్‌ను టీడీపీకి కేటాయిస్తే ఆ పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు. భిక్షపతి యాదవ్‌కు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని.. లేకపోతే ఆత్మహత్యచేసుకుంటానని పలువురు కార్యకర్తలు హెచ్చరించారు. గచ్చిబౌలి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి.. గాంధీ విగ్రహం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా నాయకులు అడ్డుకున్నారు. హైదర్‌నగర్ చెందిన సయ్యద్ అనే కార్యకర్త గాంధీభవన్ పైకి ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. బాలరాజు అనే కార్యకర్త ఎడమ చేతిని బ్లేడుతో కోసుకున్నాడు. తీవ్ర గాయమయిన అతడ్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. వైద్యులు అతడి చేతికి 17 కుట్లు వేశారు.ఆందోళన చేపడుతున్న భిక్షపతి యాదవ్‌ను మాజీ ఎంపీ మధుయాష్కి బుజ్జగించారు.