మహాభారత యుద్ధంలో న్యాయం పాండవుల వైపు ఉన్నందున, శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. దీంతో కౌరవులు ఓడిపోయారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం సీఎం కేసీఆర్ వైపు ఉన్నది. యాదవులు మద్దతు ఇస్తున్నందున ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది అని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ధర్మం ఎక్కడ ఉంటే యాదవులు అటువైపే ఉంటారని పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గకేంద్రంలో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. యాదవుల గురించి అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పారని గుర్తుచేశారు. గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం. గొల్లాయన బలిస్తే తెలంగాణకు లాభం అని అన్నారని వివరించారు. గొల్లకుర్మల సంక్షేమం కోసం ఇంతగా కృషి చేసిన సీఎం కేసీఆర్‌ను కర్ణాటక మంత్రి గొంగళి కప్పి సన్మానించారని పేర్కొన్నారు. యాదవులే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఇంత మంచిపని చేయరని అన్నారని గుర్తుచేశారు. యాదవులకు టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యం కల్పించామని, నలుగురికి టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే అమరావతికి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఢిల్లీకి పోతది. టీజేఎస్‌కు ఓటేస్తే ఎటు పోతదో తెలియదు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే రాష్ట్ర అభివృద్ధి పరంపర కొనసాగుతది. కాంగ్రెసోళ్లు చంద్రబాబును నమ్ముకుంటే, చంద్రబాబేమో కాంగ్రెసోళ్లను నమ్ముకున్నడు. టీఆర్‌ఎస్ మాత్రం తెలంగాణ ప్రజలను నమ్ముకున్నది అని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తించకుండా విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు కంటి వెలుగు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని హరీశ్ సూచించారు. కాంగ్రెసోళ్లు ఎన్నికలప్పుడే జనంలోకి వస్తారని, తర్వాత మర్చిపోతారని విమర్శించారు. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని క్షేత్రస్థాయిలో జనం కోరుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధిలో గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన గీతారెడ్డి, విజయరామారావు, నర్సారెడ్డి ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేదని విమర్శించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీళ్లిస్తున్నామని, నీళ్ల బిందెను చూస్తే కేసీఆరే కనిపిస్తున్నారని ఆడబిడ్డలు చెప్తున్నారని తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు పంచిపెట్టే క్వార్టర్ సీసాలు కావాలో… ఇంటింటికి గోదావరి నీళ్లు కావాలో ఆలోచించాలన్నారు. నెల రోజులు కష్టపడితే 60 నెలలు మీ సేవలో ఉంటామని, కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.