కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితిలో ఆగ్రహజ్వాలలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణ ఉద్యమంలో ఏ కాంగ్రెస్, టీడీపీలపై పోరాడామో.. ఇప్పుడు అదే పార్టీలతో కలిసి పనిచేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నాయి. చంద్రబాబు చెప్తేకానీ టీజేఎస్‌కు స్థానాలు లభించే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నాయి. ఇప్పటిదాకా అంతర్గతంగా రగిలిన మంటలు.. ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన టీజేఎస్ కోర్‌కమిటీ సమావేశంలో ఈ అంశాలపై వాడివేడి చర్చ సాగిందని విశ్వసనీయవర్గాలు సమాచారం.
కూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కనీసం ఒక్క సీటు కూడా టీజేఎస్‌కు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తున్నది. నిజామాబాద్‌లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. తెలంగాణ జనసమితి పార్టీ పేరును రిజిస్టర్ చేసిన అంబటి శ్రీనివాస్‌కు కూడా టికెట్ దక్కేలా కనిపించడం లేదు. ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి టికెట్ ఆశిస్తుంటే.. పొత్తులో భాగంగా ఆ స్థానం కాంగ్రెస్‌కు వెళ్లేలా ఉన్నది. పార్టీ పేరును కోదండరాంకు త్యాగంచేసిన అంబటి శ్రీనివాస్‌కు టికెట్ దక్కే అవకాశాల్లేని పరిస్థితి ఏర్పడింది. మిర్యాలగూడ నుంచి టికెట్ ఆశించిన విద్యాధర్‌రెడ్డికి కూడా ఆశాభంగమే ఎదురయ్యేలా ఉన్నది.
దళిత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న బైరి రమేశ్, చింత స్వామి ఈసారి జనసమితి నుంచి పోటీచేయాలనుకున్నారు. వారికి కూడా టికెట్ దక్కడం లేదు. బీసీ నాయకుడు సత్యం పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది.నిజామాబాద్ జిల్లా జేఏసీ నేత గోపాల్‌శర్మ ఆశలు కూడా గల్లంతేనని చెప్తున్నారు. గాదె ఇన్నయ్యకు కూడా పోటీచేసే అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తున్నది. ఇలా పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కోదండరాంపై తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారని సమాచారం. దీంతో ఇటీవలి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కోదండరాం.. ఇట్లయితే ఇగ నేను పోటీచేయను.. మీరే పోటీ చేసుకోండి అని అన్నట్లు తెలిసింది. తాను ప్రచారం మాత్రమే చేస్తానని, కూటమిలో ఇచ్చే స్థానాలను మీకే పంచేస్తానని అలకబూనారని సమాచారం. త్వరలోనే పార్టీలో చీలిక ఖాయమని కొందరు నాయకులు పార్టీ మారడం పక్కా అని పలువురు విశ్లేషిస్తున్నారు.
Tags congress kodandaram tdp telanganajanasamithi