పొత్తు పేరుతో తమ సీట్లకు ఎసరు పెడుతుండటంపై ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు భగ్గుమంటుండగా…తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ఆమె స్పష్టం చేస్తూ…అది కూడా కొన్ని పరిమితులతోనే తమ పార్టీల మధ్య మిత్ర బంధం ఉంటుందని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీకి షాకిచ్చిన విజయశాంతి తాజాగా మిత్రపక్షమైన టీజేఎస్‌కు మైండ్ బ్లాంక్ చేసే కామెంట్లు చేశారు.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్ పక్కనే ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో విజయశాంతి పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటుగా మెదక్ సీటుపై కూడా ఆమె కన్నేసినట్లు సమాచారం. ఈ మేరకు అక్కడ పోటీ చేసేందుకు తాను ఆసక్తికతో ఉన్నట్లు రాములమ్మ స్వయంగా ప్రకటించారు. “దుబ్బాక , మెదక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పోటీ చేసి తీరుతుంది. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్న చోట టీజీఎస్ కూడా సమర్దించాలి , సహకరించాలి. లేకుంటే అందరం నష్టపోతాం.“ అంటూ ప్రకటించారు.
అయితే, ప్రజలు మరిచిపోయిన రాములమ్మ ప్రభావం ఎంత ఉంటుందనేది ఆసక్తిగా మారింది.మరోవైపు తాము గురిపెట్టిన సీట్లపై కాంగ్రెస్ నేతలు కన్నేస్తున్నారని టీజేఎస్, టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కాగా, సిద్దిపేట నుంచి పోటీచేస్తున్న మంత్రి హరీష్‌రావు, దుబ్బాక, మెదక్ అసెంబ్లి నియోజకవర్గాల్లో అధికార తెరాస పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు రామలింగారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డిల ప్రభావాన్ని ఎదుర్కొని విజయశాంతి గెలవడం అంత ఈజీ కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags revanth reddy telangana tpcc uttham kumar reddy vijayashanthi