టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మహాకూటమి రూపంలో జట్టుకట్టిన టీజేఎస్, సీపీఐ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో ఢిల్లీ పెద్దలు తమ మార్కు స్కెచ్చుల రుచి చూపిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. భాగస్వామ్య పార్టీల సీట్ల సంఖ్యపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ప్రచారం చేస్తుండగా వివాదాస్పదమైన కొన్ని స్థానాల విషయంలో చర్చలు ముందుకు సాగటం లేదని మిత్ర పక్షాల నేతలు అంటున్నారు. అయితే, ఇదంతా ఢిల్లీ దెబ్బ ఏంటో కోదండరాం, వామపక్షాలకు రుచి చూపించే ఎత్తుగడలో భాగమంటున్నారు.
కాంగ్రెస్ నేతల సాగతీత ధోరణితో టీజేఎస్, సీపీఐ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరు తమ గోడును ఒకరి కొకరు వినిపించుకోవటం మినహా ఏమీ చేయలేక పోతున్నారు. కూటమిలో కొనసాగుతామని చెప్తూనే కాంగ్రెస్ నేతల వైఖరిపై ఆంతరంగీకుల వద్ద తమ గోడు చెప్పుకుంటున్నారు. రాజకీయవర్గాల సమాచారం ప్రకారం టీజేఎస్ పార్టీ 10 స్థానాలు కావాలని ఇప్పటికీ పట్టుపడుతూనే ఉంది. అయితే ఎనిమిది స్థానాలకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్ అక్కడో మెలిక పెట్టింది. అదే… టీజేఎస్ కోరుతున్న స్థానాలు కాకుండా అప్రాధాన్యత కలిగిన స్థానాలు కేటాయించటం! దీంతో షాక్ అవడం కోదండరాం టీం వంతు అవుతోంది.
ఇక సీపీఐ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని సమాచారం. సీట్ల పంపకాల కోసం కూటమి పార్టీల నేతలు కూర్చుని చర్చలు జరపకుండా విడివిడిగా మాట్లాడుకోవటం, మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నెరపటం జరుగుతున్న తీరు సీపీఐ, కోదండరాంలను కలవరపాటుకు గురిచేస్తోందని సమాచారం. మరోవైపు కూటమిలోని ఇతర పార్టీలు కోరుతున్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధులను ఎంపిక చేసి పెట్టుకోవటం వివాదాస్పదమవుతోంది. తమతో పొత్తు అంటే ఎలా ఉంటుందో…సీట్ల వ్యవహారంలోనే టీజేఎస్, సీపీఐ నేతలకు కాంగ్రెస్ రుచి చూపిందని పలువురు సెటైర్లు వేస్తున్నారు.
Tags kodandaram l ramana N. Uttam Kumar Reddy tdp telangana tjs