తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుదర్చుకునేందుకు ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. ఆవిష్కరణలకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న తమ దేశం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఎస్టోనియా రాయబారి రిహో క్రువ్ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్ దక్కన్ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టోనియా దేశ స్టడీ అంబాసిడర్ పాయల్ రాజ్‌పాల్, వాణిజ్యం, పెట్టుబడుల సలహాదారుల అంకిత్‌బాల్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
యూరోపియన్ యూనియన్‌లో భాగమైన తమ దేశంలో 8 యూనివర్సిటీలు, 169 కోర్సులతో ఉన్నత విద్యను అన్నివర్గాలకు అందుబాటులో ఉండే రీతిలో అందిస్తున్నట్లు వెల్లడించారు. తమ దేశంలో విద్యాభ్యాస వీసాలతో పాటుగా కొలువులకు చేసుకునేందుకు సైతం అనుమతి ఉందని, మిగతా దేశాల వలే నిషేధం లేదన్నారు.
ఉన్నత విద్యకు తమ దేశం అత్యున్నతమైన వేదిక అని వెల్లడించారు. స్టార్టప్ దోరణికి తమ దేశం అండగా ఉంటోందని, ఈ క్రమంలో ఇప్పటికే పలు భారతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో తమకు అత్యుత్తమ సంస్థలు ఉన్నట్లుగా భావించి ప్రాథమిక చర్చలు జరిపినట్లు వెల్లడించారు.