కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఏర్పాటుచేసిన ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కిరావటం లేని సంగతి తెలిసిందే. చాలా స్థానాల్లో తామే బలమైన శక్తిగా చెప్పుకొంటుండటంతో పరిష్కారం జటిలమవుతోంది. ఎవరికివారు తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో నిరంతర చర్చలు జరుపుతున్నా.. ఎవరెన్ని సీట్లకు? అందులోనూ ఏయేస్థానాల్లో పోటీచేయాలన్న విషయంలో స్పష్టత రావటంలేదు.
టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తాము ఆశిస్తున్న సీట్ల వివరాలను కాంగ్రెస్‌కు జాబితారూపంలో అందించాయి.ఇలా ఓ వైపు పార్టీలు సీట్ల కోసం ఆరాటపడుతుంటే…ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జనసమితి మరో కొత్త ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.
అదే తమ పార్టీ విలీనం చేయడం. ప్రొఫెసర్ కోదండరాంను సీఎం చేస్తామంటే…టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ఆ పార్టీ ఆలోచన చేస్తున్నట్లుగా పలు మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. కాగా, ఈ పరిణామం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ప్రతిపాదన ఎవరు చేస్తున్నారు…ఈ నిర్ణయం జరిగేపనేనా అనేది సందేహంగా మారింది.