ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కలకలం చోటుచేసుకుంది. ఇప్పటిదాక ఒక బలమైన సామాజికవర్గానిదే హవా కొనసాగిన నేపథ్యంలో మరో వర్గం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా పరిణామంపై భగ్గుమంటున్నారు. కాంగ్రెస్‌లో ఆదిపత్యం చెలాయించే వర్గం రాబోయే ఎక్కువ సీట్లలో వారే పోటీ చేస్తారని ప్రచారంలో పెట్టడంతో పాటుగా ఆమేరకు నియోజకవర్గాలనూ ఎంచుకున్నామని అంటున్నారు. దీంతో….కాంగ్రెస్‌లోని బీసీలంతా తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
వేరే కుంపటి పెట్టి అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలంటూ, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీసీలకు రెండు స్థానాలు కేటాయించాలన్న డిమాండ్ తెరమీదికొచ్చింది.అదే సమయంలో రాష్ట్ర నాయకత్వం మౌఖిక ఆదేశాలమేరకు ఇప్పటికే పలు స్థానాల్లో కొందరు నేతలు ప్రచారం ప్రారంభించారు. దీంతో ఆశావహులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నాయకులను బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. అసంతృప్తులకు త్యాగాల ట్యాగ్ వేసి అసమ్మతిని తగ్గించేందుకు సీనియర్లు రంగంలోకి దిగారు.
ఎవరి అనుయాయులకు వారు నచ్చ చెప్పే పనిలో పడ్డారు. తాత్కాలింగా వారిని సంతృప్తి పరుస్తున్నా…అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్‌కు అసమ్మతి సెగ తాకనుందని ఆశావహులు చెబుతున్నారు.కాగా, బీసీల ఆందోళన చిలికి చిలికి గాలివానలా మారింది. బీసీల టికెట్ల పంచాయతీ హస్తినకు చేరింది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ తెలంగాణలోని బీసీ నేతలైన మధుయాష్కీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, నాగయ్య, చిత్తరంజన్‌దాస్, కత్తివెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మహేష్‌కుమార్‌గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చించింది. త్వరలో ఈ ఆందోళనకు ఫుల్‌స్టాప్ పెట్టనున్నట్లు సమాచారం.