రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వందకు పైగా సీట్లతో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారే వరకు సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకర్గం మేడిపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు నేతృత్వంలో బుధవారం ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ప్రజలు అద్భుతమైన, అంచంచల విశ్వాసాన్ని చూపిస్తున్నారన్నారు. గతంలో తెలంగాణను అడ్డుకున్న గడ్డాలు.. చంద్రబాబు, ఉత్తమ్‌కుమార్, ఎల్ రమణ, జీవన్‌రెడ్డి ఇప్పుడు కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారని విమర్శించారు. ఎన్ని గడ్డాలు, ఎన్ని గుంటనక్కలు కలిసినా కేసీఆర్‌ను ఓడించలేవన్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం వరంగల్, మెదక్ ఉప ఎన్నికలు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు.. ఇలా సందర్భం ఏదైనా ప్రజలు కేసీఆర్‌వైపు ఉన్నారని గుర్తుచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో 12 సీట్లు గెలిచామని, ఒక్క జగిత్యాలలో మాత్రమే ఓటమిచెందామని, ఇప్పుడు 13 సీట్లలో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేస్తుందన్న నమ్మకం కలుగుతున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చనిపోయినవారి పేర్లతో కేసులు వేయించిందని, కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలంటూ ఢిల్లీకి 30 లేఖలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు జట్టుకడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుందని, రేపటి రోజున పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులను చంద్రబాబు నిర్మించనిస్తాడా? అని ప్రశ్నించారు.