తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కి మహిళలు చక్కర్లు కొట్టారు. సికింద్రాబాద్‌లోని బైసన్ పోలోగ్రౌండ్‌లో గురువారం పారా మోటరింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరినీ అబ్బురపరిచారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, షీటీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీత భగవత్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమని, ప్రకృతి ఆరాధనకు, ప్రేమ, ఆప్యాయతలకు నిలయమని అభిప్రాయపడ్డారు.