తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రచారవేగాన్ని మరింత పెంచనున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఇప్పటికే ఒక విడుత ప్రచారాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో.. తాజాగా పాక్షిక మ్యానిఫెస్టో ప్రకటనతో మరోసారి ఉధృతస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగల వాతావరణం నుంచి బయటికి వచ్చినందున ప్రచార వేగాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనికితోడు వచ్చేవారంలో సీఎం కేసీఆర్ యాభైరోజులు వందసభలు ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను ప్రచారానికి సన్నద్ధం చేయడం, ఓటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు అమలుచేసిన పథకాలు, పార్టీ అధికారంలోకి రాగానే అమలుచేసే పథకాలు, ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేయడం, ఓట్లు టీఆర్‌ఎస్‌కు వేసే విధంగా చూడటం ఇలా పోల్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించడంపై సీఎం కేసీఆర్ దృష్టి నిలిపారు. రాబోయే రోజులు కీలకం కావడంతో పార్టీ అభ్యర్థులతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అవగాహన సదస్సును ఈ నెల 21న నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాల్గొని అభ్యర్థులతో స్వయంగా మాట్లాడుతారు. పార్టీ ఎంపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అభ్యర్థులకు ఈ సమావేశంలో అవగాహన కల్పిస్తారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఈ సమావేశంలో విధిగా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది.
సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరుసటిరోజు హుస్నాబాద్ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ తరువాత అక్టోబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వరుసగా జిల్లాస్థాయిలో బహిరంగసభల్లో పాల్గొన్నారు. తాజాగా పార్టీకి కీలకమైన మ్యానిఫెస్టో పాక్షిక అంశాలను ప్రకటించిన నేపథ్యంలో వరుసగా సభలకు శ్రీకారం చుట్టనున్నారు.