తన్నీరు హరీశ్ రావు…టీఆర్ ఎస్ పార్టీ అధినేత – తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు. ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి చరిష్మా – సత్తా ఉన్న నాయకుడనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అలాంటి టాక్ కారణంగానే ఆయన ఇరకాటంలో పడ్డారని – గులాబీ దళపతి వారసుల పోరులో హరీశ్ రావుకు కుంపట్లు మొదలయ్యాయని…ఏకంగా పార్టీకి మద్దతిచ్చే మీడియాల్లోనే ఆయన్ను పక్కనపెట్టే పరిస్థితి ఎదురైందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు పొగబెడ్తున్న తీరును గమనించిన హరీశ్ `లో ప్రొఫైల్` మెయింటెన్ చేస్తున్నారని పలువురు విశ్లేషించారు. ఇలా రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్న సమయంలోనే…హరీశ్ సృష్టించిన ఓ ప్రత్యేక రికార్డు తెరమీదకు వచ్చింది.
అదే దేశంలో ఆరుసార్లు గెలిచిన యువ ఎమ్మెల్యేగా హరీశ్ రికార్డ్ సృష్టించడం. కేరళకు చెందిన ఎమ్మెల్యే కేఎం మణి ఖాతాలో ఆరుసార్లు గెలిచిన యువ ఎమ్మెల్యే రికార్డ్ ఉంది. ఇప్పటివరకు గులాబీ దళపతి కేసీఆర్ సైతం ఏడు సార్లు గెలిచి ఎనిమిదో దఫా విజయం కోసం సిద్ధమవుతున్నారు. అయితే – ఆయన ఆరో గెలుపు నాటికి ఆయన వయసు 50 ఏళ్లు. ప్రస్తుతం జరుగుతున్న జరుగుతున్న ఎన్నికల్లో హరీశ్ రావు గెలుపొందితే – ఆయన ఖాతాలో ఈ రికార్డు చేరుతుంది. ఆరోదఫా విజయం నాటికి హరీశ్ వయసు 46ఏళ్లు. దీంతో దేశంలోని ఎమ్మెల్యేల్లో ఆరుదఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన అతి పిన్న వయసు ఎమ్మెల్యేగా హరీశ్ రావు ప్రత్యేకతను సొంతం చేసుకోనున్నారు.
కాగా రాష్ట్రంలోని ఇతర నేతల విషయానికి వస్తే…దివంగత బాగారెడ్డి – తాజా మాజీ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఏడుసార్లు గెలుపొందారు. అయితే ఆరోసారి గెలుపొందిన సమయంలో బాగారెడ్డి వయసు 53 ఏళ్లు కాగా – జానారెడ్డి వయసు 63 ఏళ్లు.కాగా దేశంలో ఇప్పటివరకు అత్యధిక సార్లు గెలుపొందిన ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యేగా తమిళనాడుకు చెందిన దివంగత నేత కరుణానిధి ఖాతాలో ఉంది. 13 సార్లు ఎమ్మెల్యేగా కరుణానిధి గెలుపొందారు. వామపక్ష నేత జ్యోతిబసు – మహారాష్ట్రకు చెందిన జి.దేశ్ ముఖ్ 11 సార్లు గెలుపొందారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.