శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కండరారు రాజీవరు.. సంచలనం రేపుతున్న మహిళల ప్రవేశం అంశంపై మాట్లాడారు. ఆలయాన్ని శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇవాళ ఇద్దరు మహిళలు శబరిమల సన్నిధానంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసుల పహారాలో ఆ ఇద్దరూ పంబ దాటి అయ్యప్ప ఆలయం వైపు వెళ్లారు. అయితే అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ అంశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సీరియస్ తీసుకున్నారు. ఒకవేళ అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే, ఆలయానికి తాళం వేస్తామని, తాళంచెవులను అప్పగించి వెళ్లిపోతానని ప్రధాన అర్చకులు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదు అని, భక్తుల వైపున తాను నిలబడనున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంలో తన వద్ద ఎటువంటి ఆప్షన్ లేదన్నారు.
ఇవాళ ఆలయంలోకి ప్రవేశించాలని జర్నలిస్టు కవిత, మహిళా కార్యకర్త రెహానా ఫాతిమా ప్రయత్నించారు. కానీ ప్రధాన అర్చకులు వారి కోసం ఆలయాన్ని తెరిచేందుకు నిరాకరించారు. మహిళలు ప్రవేశిస్తే తాము ఆలయాన్ని మూసివేస్తామని ప్రధాన అర్చకులు హెచ్చరించడంతో వెనుదిరిగినట్లు కేరళ ఐజీ శ్రీజిత్ తెలిపారు. ఇదో సాంప్రదాయ విధ్వంసంగా మారిందని ఐజీ అభిప్రాయపడ్డారు. ఇద్దరు మహిళలను గుడి వరకు తీసుకువెళ్లామని, కానీ దర్శనం మాత్రం అర్చకుడి ఆధీనంలో ఉంటుందని, ఆయన అనుమతి ఇస్తేనే దర్శనం జరుగుతుందని ఐజీ శ్రీజిత్ అన్నారు. స్వామి దర్శనం కోసం వచ్చిన మహిళలకు తాము రక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఐజీ అన్నారు.
అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. కానీ ఆలయం వద్ద నిరసనకారులు ఘర్షణకు దిగడాన్ని సహించబోమన్నారు. శబరిమలలో పోలీసులు ఎటువంటి సమస్యను సృష్టించరని శ్రీజిత్ తెలిపారు. భక్తులకు సహకరిస్తామన్నారు. తాము చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు.