విజయదశమినాడు ముఖ్యమైనది శమీపూజ. శమీవృక్షమంటే జమ్మిచెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములనూ, వస్త్రములను ఈ శమీ వృక్షంపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసం పూర్తవగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు.
శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు.తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్ట ను చూచే సాంప్రదాయం కూడా ఉన్నది.విజయదశమి రోజు సాయంత్రం నక్షత్రదర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్ద గల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో
శమీశమీయతే పాపం శమీశత్రునివారిణీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ.
అని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ పై శ్లోకం స్మరిస్తూ ఆ శ్లోకములు వ్రాసుకున్న చీటీలు అందరూ చెట్టుకొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.