సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ యస్ మండలం దాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్, లీడర్ శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై.వి,సీనియర్ టీఆర్ఎస్ నేత కాకి కృపాకర్ రెడ్డి, ఆత్మకూర్ యస్ యం.పి.పి లక్ష్మీ బ్రాహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది పార్టీల పంచాయతీ కాదు. తెలంగాణ ప్రజల బతుకుతెరువును నాశనము చేసిన జెండాలను బండకు కొట్టండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ తో కాంగ్రెస్ పొత్తా? వ్యవసాయాన్ని బతికిస్తేనే అందరం బతుకుతాం. 60 ఏండ్లుగా ఓట్లు వేసి గెలిపించిన పార్టీలు వ్యవసాయం గురించి ఏ ఒక్క రోజు ఆలోచించలేదు. రుణమాఫీ చెయ్యడం కాదు…అప్పు లేకుండా వ్యవసాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.
యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతుల సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరుపమే రైతుబందు, రైతు భీమా. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకే రైతు భీమా. మరణించిన 48 గంటల వ్యవధిలో రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెల్లింపు. 2014 కు ముందు తెలంగాణా ఉద్యమానికి ముందు పాలించిన పార్టీలన్నీ ఆంధ్రా పాలకులకు మడుగులు ఒత్తినవే. ఒక్క దాచారం గ్రామానికే ఫించన్ ల రూపంలో ఇప్పటివరకు చెల్లించింది మూడు కోట్ల పై చిలుకు. గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తి. ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేకపోయారు. ఓట్లకోసం వస్తున్న కూటమి నేతలను నిలదీయండి. యావత్ భారతదేశంలో ఉచితంగా నిరంతర విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణానే.
పండిట్ జవహర్ లాల్ నెహ్రు నుండి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన వారి సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఉచిత విద్యుత్ కాదుకదా ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు అసలు విద్యుత్ లేదు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని ఇదే పరిస్థితి. ఇటువంటి పార్టీలకు ఓటువేస్తే తెలంగాణా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిచి పోతాయి. ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ నిర్మాణాలు ఆగిపోతాయి. కళ్యాణాలక్ష్మి పధకానికి తిలోదకాలు ఇస్తారు. కులవృత్తులను ఆర్ధికంగా పరిపుష్టం చేసేందుకు చేపట్టిన ప్రణాలిలకు బ్రేక్ పడుతుంది. కేసీఆర్ కిట్ పధకానికి చరమగీతం పాడుతారు. ఇన్ని సంక్షేమ పథకాలకు మంగళం పాడే పార్టీలకు ఓటువేస్తే నిండా మునుగుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే సంక్షేమం. గులాబీ గూటికి చేరుదాం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలబడదామని మంత్రి పిలుపునిచ్చారు.