ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్,బీజేపీలు కంకణం కట్టుకున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తనకు సిద్ధాంతపరంగా బద్దశత్రువైన టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకోగా…బీజేపీ మత రాజకీయం చేస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ రెండు పార్టీలు చేసిన కార్యక్రమాలను చూసి రాజకీయ వర్గాలు ఈ మేరకు వ్యాఖ్యానిస్తున్నాయి.
సికింద్రాబాద్‌లోని బిషప్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు బిషప్‌లతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో క్రైస్తవుల మద్ధతు కోరారు. ఈ సందర్బంగా బిషప్ లు తెలంగాణ లో వారి సమస్యలు, డిమాండ్లు తో కూడిన వినతి పత్రం సమర్పించారు. బిషప్ ల డిమాండ్లపై కాంగ్రెస్ నాయకులు సానుకూలంగా స్పందించారు. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి కుంతియా, ఏఐసీసీ మైనారిటీ విభాగం వైస్ చైర్మన్ అనిల్ ఏ థామస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానా రెడ్డి, రేవంత్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా… కాచిగూడలోని శ్యామ్ బాబా మందిర్‌లో సమావేశ మందిరంలో తెలంగాణలోని సాధు సంతులతో సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ జేపీ నడ్డా, బీజేపీ నేతలు మురళీధరరావు, లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి హాజరయ్యారు. హిందువులపై దాడులు చేసే వారికే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని ఈ సందర్భంగా అమిత్ షా వారితో వ్యాఖ్యానించినట్లు సమాచారం. తెలంగాణలో హిందువుల పై దాడులు జరుగుతున్నా… సర్కార్ పట్టించుకోవటం లేదని పలువురు బీజేపీ నేతలు అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. కాగా, సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం కోణంలో సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు మతపరమైన విద్వేషాలకు బీజం వేసేలా ఉందని పలువురు మండిపడుతున్నారు.