ఉత్తరాంధ్రను తుఫాను వణికిస్తోంది. ‘తితలీ’ అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది పెను తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై ‘రెడ్ మెసేజ్’ జారీ చేసింది. అతితీవ్ర తుఫానుతో బుధవారం సాయంత్రానికి గాలుల ఉధృతి పెరిగింది. గురువారం ఉదయం ఇది తీరం దాటే సమయంలో దక్షిణ ఒడిసా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 140 నుంచి 150… ఒక్కొక్కసారి 165 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. బుధవారం రాత్రి నుంచే ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురవడం మొదలైంది. తుఫాను తీరం దాటే సమయంలో దక్షిణ ఒడిసా, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం నుంచి విశాఖ జిల్లా వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాలలో కుంభవృష్టిగా కురుస్తాయి. ఉభయ గోదావరిజిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం అలలు ఉవ్వెతున్న ఎగిసిపడనుండటంతో తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంది.
తిత్లీ తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఉత్తరాంధ్రపై కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జల్లా వణికిపోతోంది. మరో నాలుగు గంటల పాటు సిక్కోలుకు భారీ వర్షాలు తప్పవని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.సాయంత్రానికి 15 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గాలుల తీవ్రతకు జీడి మామిడి తోటలకు అపారనష్టం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భోగాపురం వద్ద జాతీయ రహదారిని మూసివేసిన అధికారులు. శ్రీకాకుళం వరకు వెళ్లే బస్సులకు మాత్రమే అనుమతినిస్తున్నారు.