ఇన్‌ఫ్రా రంగంలో తెలుగు రాష్ట్రాల్లో నెం1 స్థాయికి చేరుకుని దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు పూర్తిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైనా లింక్-1లోని మూడు పంపింగ్ స్టేషన్లకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసే నాలుగు సబ్‌స్టేషన్లు వాటి లైన్లను సకాంలో పూర్తి చేసి తన నైపుణ్య ప్రతిష్టతను చాటుకుంది. దేశంలోనే తొలి అతిపెద్దదైన ప్రైవేటు రంగంలోని ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ (డబ్ల్యూయూపిపిటిసిఎల్)ను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కదిరి వద్ద భారీ సబ్‌స్టేషన్‌ను గడువుకన్నా ముందే పూర్తి చేసి పవర్‌గ్రిడ్ నుంచి పురస్కారం అందుకుని జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన మేఘా తాజాగా కాళేశ్వరం లింక్-1లోని భారీ విద్యుత్ వ్యవస్థను సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్ట్‌లో లింక్-1 కింద 3 పంప్‌హౌస్‌ల నుంచి 28 పంప్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయటానికి 1120 మెగా వాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇంత భారీ స్థాయిలో విద్యుత్‌ను వినియోగించి రోజుకు కనీసం 2 టిఎంసీల నీటిని ఎత్తిపోయటానికి అంతే విద్యుత్ అవసరమవుతుంది. ప్రపంచంలో ఇంతపెద్ద స్థాయిలో విద్యుత్‌ను వినియోగించే ఎత్తిపోతల పథకాలు ఇంతవరకు ఎక్కడా నిర్మించలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇజిప్ట్‌లోని ముబారక్ పంపింగ్‌స్టేషన్ మాత్రమే అతి పెద్దది. ఈ ఎత్తిపోతల పథకానికి 288 మెగావాట్ల విద్యుత్ వినియోగించే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏడేళ్ళ కాలం పట్టింది. కానీ మేఘా ఇంజనీరింగ్ చేపట్టిన కాళేశ్వరం లింక్-1 విద్యుత్ వ్యవస్థ దానికన్నా దాదాపు నాలుగు రెట్లు పెద్దది కాగా ఏడాది సమయంలోనే పూర్తి చేసి తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చాటుకుంది.
లింక్-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ-8 (రామడుగు) 4 సబ్‌స్టేషన్లతో పాటు ట్రాన్స్‌మిషన్ లైన్లను నిర్ణీత గడువు ఏడాదిన్నర లోగా పూర్తి చేసింది. రామడుగు (ప్యాకేజ్-8) సబ్‌స్టేషన్ 2017 ఫిబ్రవరి 22న ప్రారంభించి 2018 మే 6న గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. సుందిళ్ల సబ్‌స్టేషన్‌ను 2017 జులై 30న పనులు ప్రారంభించి 2018 జులై 18తేది లోగా పూర్తిచేసింది. ఏడాదికి ముందే ఈ సబ్‌ష్టేషన్ పూర్తయ్యింది. అన్నారం సబ్‌స్టేషన్ పనులు 2017 ఏప్రిల్ 1న ప్రారంభించి 2018 సెప్టెంబర్ 14న వినియోగంలోకి తెచ్చి గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. మేడిగడ్డ సబ్‌స్టేషన్ 2017 ఏప్రిల్ ప్రారంభం కాగా 2018 సెప్టెంబర్ 29న ఛార్జ్ చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. మొత్తం లింక్-1లో వీటి పనులు పూర్తికావడం వల్ల జైపూర్ (అదిలాబాద్) విద్యుత్ కేంద్రం నుంచి మేడిగడ్డ వరకు విద్యుత్ నిరంతరాయంగా సరఫరా అయ్యే వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేయగలిగింది. 2017లో నాలుగు సబ్‌స్టేషన్ల పనులను తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించగా రికార్డు సమయంలో అంటే 2018 మే నెల నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి వరుసగా నాలుగు సబ్‌స్టేషన్లను ఎంఈఐఎల్ అందుబాటులోకి తెచ్చిందని ఎంఈఐఎల్ పవర్ డిపార్ట్‌మెంట్ వైస్‌ప్రెసిడెంట్ ప్రవీణ్ శరథ్ దీక్షిత్ చెప్పారు.
రామడుగుతో మొదటి అడుగు:
ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్‌స్టేషన్‌ను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 8లో భాగంగా మేఘా నిర్మించింది. ఈ పంప్‌హౌజ్‌లో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 భారీ పంప్‌మోటార్లకు విద్యుత్‌ను అందించేందుకు 400/13.8/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. సబ్‌స్టేషన్‌తోపాటు 18 కిలోమీటర్ల మేర 400 కేవీ క్యూఎండీసీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సబ్‌స్టేషన్‌ను కరీంనగర్ జిల్లా రామడుగులో నిర్మించింది.
ఏడాదిలోపే సుందిళ్ల:
సుందిళ్ల లింక్-1, లింక్-2ను అనుసంధానం చేస్తుంది. రోజుకు కనీసం రెండు టిఎంసిల నీటిని పంప్ చేసే విధంగా 9 మోటర్లను (పంప్‌లను) ఏర్పాటు చేస్తున్నారు. 360 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సుందిళ్ల పంపింగ్‌స్టేషన్‌లోని తొమ్మిది పంప్‌మోటార్లకు విద్యుత్‌ను అందించేందుకు 400/220/11 కేవీ సబ్‌స్టేషన్, ట్రాన్స్‌మిషన్ లైన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్‌స్టేషన్ సుందిళ్ల పంప్‌హౌజ్‌లోని పంప్‌మోటార్లకు విద్యుత్‌ను అందించడంతోపాటు 220/11 కేవీ అన్నారం, 220/11 కేవీ మేడిగడ్డ సబ్‌స్టేషన్లకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీనిని పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల పంప్‌హౌజ్‌కు సమీపంలోని గోలివాడ గ్రామం వద్ద ఏర్పాటు చేశారు.
అన్నారం సబ్‌స్టేషన్:
480 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంప్‌హౌజ్‌లోని 12 పంప్‌మోటార్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ 220/11 కేవీ అన్నారం సబ్‌స్టేషన్, ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటు చేశారు. 28 కిలోమీటర్ల 220 కేవీ టీఎండీసీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను 400/220/11 కేవీ సుందిళ్ల సబ్‌స్టేషన్ నుంచి 220/11 కేవీ అన్నారం సబ్‌స్టేషన్ వరకు ఏర్పాటు చేశారు. ఈ సబ్‌స్టేషన్‌ను పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్ద ఏర్పాటు చేశారు.
మేడిగడ్డతో అందుబాటులోకి నాలుగు సబ్‌స్టేషన్లు:
మేడిగడ్డ సబ్‌స్టేషన్ చార్జింగ్ ప్రక్రియ పూర్తికావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1లోని నాలుగు సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మేడిగడ్డ పంప్‌హౌజ్‌లోని 17 పంప్‌మోటార్లకు విద్యుత్‌ను అందించేందుకు 220/11 కేవీ మేడిగడ్డ సబ్‌స్టేషన్‌ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు గానూ 400/220/11 కేవీ సుందిళ్ల సబ్‌స్టేషన్ నుంచి 220/11 కేవీ మేడిగడ్డ సబ్‌స్టేషన్ వరకు 80 కిలోమీటర్ల మేర 220 కేవీ టీఎండీసీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని జయశంకర్ భూపాపల్లి జిల్లాలోని మేడిగడ్డ పంప్‌హౌజ్ వద్ద ఏర్పాటు చేశారు.
లింక్-1లో మేఘా చేపట్టిన కీలకమైన అన్ని సబ్‌స్టేషన్లు అందుబాటులోకి రావడంతో త్వరలోనే మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం, అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్ల, సుందిళ్ల బ్యారేజీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించేందుకు ఆయా పంప్‌హౌజ్‌ల్లోని మోటార్ల డ్రై, వెట్‌రన్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ ట్రాన్స్‌మిషన్, సబ్‌స్టేషన్ల నిర్మాణంలో సంస్థకు ఉన్న అనుభవంతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వం నిర్దేశించిన గడువుతోపాటు, తమ నిరంతర పర్యవేక్షణ ద్వారా పనలు వేగం పెంచడం వల్ల ఈ రికార్డును నెలకొల్పేందుకు సాధ్యమైందని, ఇది అరుదైన విషయం అని ఎంఈఐఎల్ పవర్ డిపార్ట్‌మెంట్ వైస్‌ప్రెసిడెంట్ ప్రవీణ్ శరథ్ దీక్షిత్ చెప్పారు. ఇంత తక్కువ సమయంలో 4 సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు పూర్తిచేయటం ఇంతకు ముందు ఎప్పుడు, ఎక్కడా జరగలేదని ఆయన విశదీకరించారు.