ప్రతిపక్షాల దుష్టకూటమికి ఓట్లడిగే నైతికహక్కు లేదని, వారికి ఓటమి తప్పదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. అభివృద్ధి కండ్ల ముందట కనిపిస్తున్నదని, ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో అందోల్ నియోజకవర్గంలోని పలుపార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వివిధ పార్టీల నుంచి సుమారు 2,500 మంది మంత్రి హరీశ్‌రావు, కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అడ్డుకొనేందుకు కేంద్రానికి లేఖలు రాసి నోటికాడి బుక్కను ఎత్తగొట్టే కుట్రచేసిన చంద్రబాబు పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. హైకోర్టు విభజనకు అడ్డుపడుతూ, కరంటు ఇవ్వకుండా మొండిచేయి చూపించిన టీడీపీతో పెట్టుకున్న పొత్తుల మహాకూటమి.. విషకూటమని మండిపడ్డారు.మహాకూటమిని గెలిపిస్తే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను చంద్రబాబు ఆంధ్రాకు తరలించే ప్రమాదమున్నదని చెప్పారు. బతుకమ్మ చీరెల పంపిణీకి అడ్డుపడిన కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వొడితెల సతీశ్‌కుమార్‌ను అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, హుస్నాబాద్, మానకొండూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులు వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందోల్ అభ్యర్థి క్రాంతికిరణ్‌ను అద్భుతమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పరాయి నాయకులు వద్దు.. స్థానికుడే ముద్దు అని సూచించారు. టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం విజయ్‌కుమార్, కొడెకల్ మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.