ఏపీలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ ఘన విజయం సాధించనుందని సీ ఓటర్ సంస్థ జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీలో ప్రసారమయ్యాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని సెప్టెంబర్ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీలో నిలిస్తే.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైసీపీకి 21 సీట్లు, టీడీపీకి కేవలం నాలుగు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవంది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా సీ ఓటర్ సర్వేలో వైసీపీదే పైచేయిగా కనిపించింది. వైసీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వెల్లడించింది. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.