నల్లగొండలో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాదసభ జనఉప్పెనను తలపించింది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 4 లక్షల మంది హాజరైన ఈ సభ నల్లగొండ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచిపోనున్నది. 40 ఎకరాల్లో సభను ఏర్పాటు చేయగా.. నీలగిరి ప్రజలు నీరాజనం పట్టారు. సభాస్థలితో పాటు చుట్టుపక్కల పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. సభ పక్కనే ఉన్న అద్దంకి-నార్కట్‌పల్లి హైవే జనంతో రెండు కిలోమీటర్ల మేర కిటకిటలాడింది. ప్రజా ఆశీర్వాదసభకు పోటెత్తిన జనప్రవాహం.. టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. నాలుగేండ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన అనేక పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు పెద్దసంఖ్యలో సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు.
పెద్ద కొడుకులా కేసీఆర్ అందజేస్తున్న పింఛన్ పొందుతున్న వృద్ధులు.. కల్యాణలక్ష్మి ద్వారా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన నిరుపేదలు.. రైతుబంధుతో పెట్టుబడి సాయం పొందిన అన్నదాతలు.. నిరంతర విద్యుత్‌తో వ్యవసాయం పండుగలా చేస్తున్న రైతన్నలు.. గొర్రెలు పొందిన గొల్లకురుమలు.. పంచాయతీలుగా మారిన గిరిజన తండాలవాసులు.. ఇలా మరెందరో లబ్ధిదారులు కుటుంబసభ్యులతో సభకు ఉప్పెనలా తరలివచ్చారు. అనుకున్నదానికంటే సభను బ్రహ్మాండంగా నిర్వహించారని సీఎం కేసీఆర్ నిర్వాహకులను సభాముఖంగా ప్రశంసించారు. తాను హెలికాప్టర్ నుంచి చూస్తే చుట్టు పక్కల చాలా దూరం వరకు జనం సభకు రాలేక రోడ్లపై ఉండిపోయారని చెప్పారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ నేతల్లో వణుకును సైతం పుట్టించింది. చెత్త నాయకులంతా ఈ జిల్లాలోనే ఉన్నారంటూ.. వాళ్లు ఎన్నడూ అభివృద్ధి కోసం పోరాడలేదని సీఎం కేసీఆర్ చీల్చి చెండాడిన తీరుతో కాంగ్రెస్ పని ఇక ఖతమేనని సభికులు చర్చించుకోవడం కనిపించింది. నల్లగొండ ఆశీర్వాదసభకు శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నీలగిరి ప్రజా ఆశీర్వాద సభను ముగించారు.