Home / 18+ / చంద్రబాబుతో కాంగ్రెస్‌కు పొత్తా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫైర్‌ ‌

చంద్రబాబుతో కాంగ్రెస్‌కు పొత్తా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫైర్‌ ‌

తెదేపాతో కాంగ్రెస్‌ పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమాలతో కష్టపడి సాధించుకున్నతెలంగాణను మళ్లీ అమరావతికి తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కాంగ్రెస్‌ నేతలు పొత్తు పెట్టుకుంటారా? సిగ్గులేదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు దుర్మార్గంగా తీసుకున్న చంద్రబాబుతో పొత్తా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెడతారా? అని నిలదీశారు. ‘కాంగ్రెస్‌ వాళ్ల ప్రచారం కోసం చంద్రబాబు రూ.500 కోట్లు ఇస్తారట.. చంద్రబాబే ప్రచారానికి హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తారట’ అంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అడుక్కుంటే తామే కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లం కదా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ నేతలు దిల్లీకి గులాంగిరీ చేస్తారని, ఆ గులాంలలో గులాంనబీ ఆజాద్‌ కూడా ఒకరనిఎద్దేవా చేశారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ తెరాసకే పట్టం కట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.నాలుగున్నరేళ్ల తమ పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. కాంగ్రెస్‌ నేతలు కోర్టు కేసులతో ఇబ్బందులు పెట్టడాన్ని సహించలేకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని అవినీతికి దూరంగా ఉండి పనిచేసిన కారణంగానే ఆర్థికంగా రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని వివరించారు. హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు.. కాంట్రాక్టు ఉద్యోగులు, అర్ధాకలితో పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెంచామని గుర్తు చేశారు. ఉద్యోగుల విషయంలో కొందరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్‌‌ ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదే అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగులకు మంచి పెంపు ఉంటుందని, ఆందోళన అక్కర్లేదన్నారు.రెప్పపాటు విద్యుత్‌కోత లేకుండా చేస్తానని అసెంబ్లీలో తాను ప్రకటించానని ఆనాడు చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేశారు. అలా చేసినట్టయితే గులాబీ కండువా కప్పుకుంటానంటూ ప్రతిపక్ష నేత జానా రెడ్డి ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్‌.. ఇప్పుడాయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

తెలంగాణలో పేదలకు ఇచ్చే రూ.1000ల పింఛన్లను మరోసారి పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఎంత పెంచాలనే అంశాన్ని మేనిఫెస్టో కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఆ వివరాలను త్వరలోనే ప్రజలకు ముందు ఉంచుతామని వెల్లడించారు. బుధవారం ఆయన ఇందూరులోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పాలనలో రూ.200లుగా ఉన్న పింఛనును తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1000కు పెంచామని గుర్తు చేశారు. తెరాస ప్రభుత్వం రూ.1000లు అందించి కాంగ్రెస్‌ చేత రూ.2000 ప్రకటించేలా చేసిందన్నారు. రూ.50.. 70.. 100 చొప్పున పింఛన్లు ఇచ్చి కాంగ్రెస్‌ నేతల నోటి నుంచి రూ.2000 ఇస్తామని ప్రకటించేలా చేసినందుకు తాను గర్వపడుతున్నాన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉండి రూ.42వేల కోట్లు ఖర్చుచేసి రూ.200గా ఉన్న పెన్షన్లను రూ.1000లు చేసినట్టు వివరించారు. తెరాస పాలనలోనే రాష్ట్రం బాగుపడుతుందని తమకు ప్రజలు అధికారం అప్పగించారని చెప్పారు.

2014లో తెలంగాణ అన్ని రంగాల్లో దెబ్బతిందని, విద్యుత్‌ కోతలు, ధ్వంసమైన చెరువులు, రైతుల ఆత్మహత్యలు ఇలా.. ఎక్కడ చూసినా సమస్యలే ఉండేవన్నారు. రాష్ట్రంలో ముసలివాళ్లను చూసేవాళ్లు, బీడీ కార్మికులను ఆదుకొనేవాళ్లు, ఒంటరి మహిళలను ఆదుకొనేవారు లేరన్నారు. అన్నమో రామచంద్ర అని అలమటించే పరిస్థతి ఉండేదన్నారు.
ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మిషన్‌ భగీరథ ద్వారా రెండు మూడు నెలల్లో ప్రతి ఇంటికీ నల్లా నీరు అందిస్తామని తెలిపారు. కేసీఆరే తమ పెద్ద కుమారుడు అని ప్రతి ఇంట్లో ప్రజలు ఆశీర్వదిస్తున్నారని సీఎం అన్నారు. మంత్రి పోచారం నేతృత్వంలో రైతులకు అనేక సేవలందుతున్నాయని చెప్పారు. రైతులకు ఉచితంగా 24గంటల పాటు విద్యుత్‌ అందించే రాష్ట్రం తెలంగాణే అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సభలు పెట్టినప్పటికీ ఇంతటి జన ప్రభంజనాన్ని తానెప్పుడూ చూడలేదని సీఎం వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌ జిల్లా ప్రజలు తెరాసను తమ గుండెల్లో పెట్టుకున్నారన్నారు. నిజామాబాద్‌ జిల్లా తొలిసారి స్వతంత్రంగా జెడ్పీ గెలిపించి తెరాస జెండా ఎగురవేసిన ఖిల్లా అని కొనియాడారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలన్నింటితో పాటు మేయర్‌, జెడ్పీ ఛైర్మన్‌ అందరినీ గెలిపించి తెరాసకు అపూరూప విజయం అందించారని కొనియాడారు. పౌరుషానికి ప్రతీక నిజామాబాద్‌ జిల్లా అన్నారు. ఈ సభకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి భారీగా జనం తరలివచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat