నిన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి చేరిన దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ తెరాస నేతలు ఇవాళ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్ల కారణంగానే కాంగ్రెస్ లో చేరామని నేతలు చెప్పారు. ఇవాళ మంత్రి హరీశ్ రావు సమక్షంలో నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న వట్టిపల్లి ఎంపీటీసి కుంట కవిత, సీనియర్ నేత యాదగిరి, ఇటిక్యాల సర్పంచి ఐలయ్య వారి అనుచరులతో తెరాసలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి కండువా కప్పారు. కాంగ్రెస్ మరో మారు తన అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెరాస కార్యకర్తలను, నేతలను ఒత్తిళ్లకు గురిచేసి పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస కార్యకర్తలు ఇలాంటి ప్రలోభాలకు గురయ్యే వారు కాదన్నారు. మెదక్ జిల్లాలో పది సీట్లు గెలిపించి కాంగ్రెస్ కు బుద్ది తెబుతారన్నారు.
తమకు , ప్రజలకు తెరాస తప్ప మరో పార్టీ భవిష్యత్తు ఇవ్వదని పార్టీలో చేరిన నేతలు చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కష్టపడతామన్నారు.
