ప్రతిపక్షాలు ఏకమై టీఆర్‌ఎస్‌పై దాడికి సిద్ధమవుతున్నాయని, అధికారం సాధించాలన్న వారి కల ముమ్మాటికి నెరవేరదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతుంటే, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు అధికారంలోకి రావాలనే యావతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ భవన్‌లో పౌరసరఫరాల శాఖ హమాలీల సంఘం నేతలు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మానవత్వంతో కాకుండా, మార్వాడీల్లాగా ఆలోచించాయని, ఏనాడు కార్మికుల ఆకలి గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోసం పుట్టలేదని, తెలంగాణ ప్రజల కన్నీరు, కష్టాల నుంచి ఆవిర్భవించిందని అన్నారు.
కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తయితాయని, భవిష్యత్‌లో కోటి టన్నుల ధాన్యం పండుతుందని అన్నారు. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారుతుందని చేప్పారు. ప్రజల కండ్ల నిండా కనిపిస్తున్న 24 గంటల నిరంతర కరెంట్ సరఫరానే మా పాలనకు నిదర్శనమని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర రష్ట్రాల్లోని ప్రజలు తెలంగాణలో కలుస్తామని తీర్మానాలు చేసి లేఖలు పంపుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఏదో విధంగా మోసం చేసి అధికారం చేజిక్కించుకోవాలని, తద్వారా తెలంగాణను దోచుకోవాలని పథకం రచిస్తున్నారని చెప్పారు.