పాత వాహనాలను తీసుకురండి.. కొత్త వాహనాలను తీసుకెళ్లండి ` ఇదేదో వాహన కంపెనీ తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేస్తున్న ప్రకటన కావచ్చు లేకపోతే ఏదైనా సంస్థ ఇస్తున్న ఆఫర్ అయి ఉండవచ్చు అనుకోకండి. ఒక పార్టీ ఎన్నికల హామీ. తెలంగాణ బీజేపీ ఈ మేరకు హామీ ఇస్తోంది. అంతేకాదు… మీరు అద్దెకు ఉంటే…అద్దె తామే చెల్లించేస్తామని ప్రకటిస్తుంది.ఇప్పుడు ఈ ప్రకటనే సోషల్ మీడియాలో సెటైర్లకు వేదికగా మారింది.
“రాష్ట్రంలో అధికారంలోకొస్తే అద్దె కుండే కుటుంబాలన్నింటినీ ఆదుకుంటాం. ప్రతి కుటుంబానికి నెలకు రూ.5 వేలకు తగ్గకుండా అద్దె చెల్లిస్తాం. పాత ఆటోలు, స్కూల్ వ్యాన్లు, ఇతరేతర వాహనాలను నడిపే వారి సౌకర్యార్థం పాత వాహనాలను తీసుకురండి.. కొత్త వాహనాలను తీసుకెళ్లండి అనే నినాదమిస్తున్నాం` ఇవి బీజేపీ ఎన్నికల ప్రణాళికలో భాగమట. ఈ అంశాలన్నీ తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చామని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ చెప్పారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల ప్రణాళికపై కొంత కసరత్తు చేశామని తెలిపారు. ఈ క్రమంలో మ్యానిఫెస్టో ముసాయిదాను పార్టీ ఉన్నతస్థాయి కమిటీకి పంపామని చెప్పారు. అక్కడి నుంచి అనుమతి రాగానే పూర్తి స్థాయిలో వివరాలను వెల్లడిస్తామని అన్నారు.
ఇలాంటి హామీలపై సహజంగానే సోషల్ మీడియాలో పంచ్‌లు పేలుతున్నాయి. ఏ ప్రాతిపదికన అద్దెకు ఉండేవారిని గుర్తిస్తారు? అద్దెకు ఉండే వారికి ఇంత మొత్తం చెల్లించడం రాష్ట్ర ఖజానాపై భారంపడదా? అసలు ఈ హామీలకు సంబంధించిన పరిణామాలను ఆలోచించారా? వంటి సందేహాలు సహజంగానే తెరమీదకు వస్తున్నాయి.