ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకునే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటి దాడులు జరిగాయా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?ఐటి విచారణ జరుగుతున్న తీరు ఈ ప్రశ్నలనే రేకెత్తిస్తోంది.
రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టి నట్లు ఫిర్యాదు లందాయని, అందుకే దాడి చేశామని తొలిరోజు చెప్పిన ఐటి అధికారులు ఆ తరువాత ఓటుకునోటు కేసుపై దృష్టి సారించారు.నామినేటెడ్ ఎంఎల్‌ఏ స్టీఫెన్‌సన్‌కు అడ్వాన్స్‌గా ఇచ్చిన 50 లక్షల గురించే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘ ఆ డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి? ఎవరిచ్చారు? మిగిలిన 4.50 కోట్ల రూపాయలు ఎవరిస్తామన్నారు? ఎలా ఇస్తామన్నారు?’వంటి ప్రశ్నలను అధికారులు అడుగుతున్నట్లు తెలిసింది.
అక్రమాస్తుల విచారణ కాస్తా, ఒక్కసారిగా ఓటుకు నోటు దర్యాప్తుగా మారడంతో రాజకీయ కలకలం ప్రారంభమైంది సెబాస్టియన్
ఓటుకు కోట్లు కేసులో భాగంగానే తాజా ఐటీ దాడులు జరుగుతున్నాయని ఓటుకు నోటు కేసులో మధ్యవర్తిత్వ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబాస్టియన్ తెలిపారు. సోమవారం ఐటీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ, ఈడీ సూచన మేరకే ఐటీ దాడులు జరిగాయని చెప్పారు.ఈ నెల 3వ తేది రేవంత్‌రెడ్డిని మరోమారు ఐటి అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే నోటీసులుజారీ చేశారు.అదేరోజు సెబాస్టియన్, ఉదయసింహలను కూడా రావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగే విచారణను కీలకంగా భావిస్తున్నారు. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం గమనార్హం.మరోవైపు చంద్రబాబుకూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.