ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది .275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్ నుంచి ప్రారంభించారు. అయితే ప్రజా సంకల్ప యాత్రలో జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు సోమవారం వైసీపీ పార్టీలో చేరారు. బీజేపీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, మహిళా మోర్చా నాయకురాలు రమణిలు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువాలతో సాదరంగా వైఎస్ జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు 200 మంది బీజేపీ కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు. అనంతరం మధు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికి సాధ్యం కాని ఘనత అని తెలిపారు. వైఎస్ జగన్‌కు లభిసున్న ప్రజాదరణ అపూర్వం అని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం అన్నారు.
