ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రోజు వేలాది మంది ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను జగన్ తో చెప్పు కుంటున్నారు. అయితే పాదయాత్రలో జగన్ చిన్నారులు, వృద్ధుల పట్ల ఎంతో జాగరూకత ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంటోంది. 275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్ నుంచి ప్రారంభించారు. కాగా ఆదివారం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో గంట్యాడ మండలం చంద్రంపేటకు చెందిన చలుమూరి ఏలేష్, రమణమ్మలు తమ పిల్లలతో పాదయాత్రలో పాల్గొన్నారు. పాత భీమసింగి జంక్షన్ నుంచి బలరామపురం, కుమరాం మధ్యలో వీరు జగన్‌మోహన్‌రెడ్డితో అడుగు కలిపారు. అయితే ఎండ ఎక్కువగా ఉండడం.. ఆ సమయంలో చోటు చేసుకున్న తోపులాట వల్ల రమణమ్మ కుమార్తె సంగీత చెప్పు జారిపోయింది. అయినా పర్వాలేదంటూ నడవబోగా కాళ్లు కాలిపోతాయి తల్లీ! అని జగన్ వారించారు. అయినా చిన్నారి వినకుండా నడుస్తానని చెప్పడంతో ఎండకు ఇబ్బంది పడతావమ్మా అని జగన్ అన్నారు. వెంటనే సెక్యూరిటీని పిలిచి అమ్మాయి చెప్పు గురించి చెప్పగా వారు కొద్దిసేపటికి చెప్పు తీసుకువచ్చారు. దీంతో చిన్నారి మళ్లీ జగనన్న వెనుక యాత్రలో పాల్గొంది.
