పల్లెలన్నీ కదులుతున్నాయి. స్వరాష్ట్రంలో.. స్వాభిమానంతో నాలుగున్నరేండ్లపాటు సాగిన పరిపాలనా ఫలాలను అందుకొన్న ప్రజలు ఇంటిపార్టీని మళ్లీ నిలబెట్టాలని నిర్ణయించుకొంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన క్షణం నుంచి అప్రతిహతంగా సాగుతున్న అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు ఇదే ఒరవడితో నిరాటంకంగా అమలుకావాలంటే గులాములు కాకుండా గులాబీలు కావాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. గ్రామాలకు గ్రామాలు సమావేశమై ఈ ఎన్నికల్లో ఇంటిపార్టీ టీఆర్‌ఎస్‌కే ఓటువేయాలని మూకుమ్మడిగా మద్దతు తెలుపుతున్నాయి. ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక గ్రామానికి చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫలానా పార్టీకి మద్దతు తెలిపిన ఘటనలు లేవు. తెలంగాణ రాష్ట్రంలోనే టీఆర్‌ఎస్‌కు మద్దతుగా పల్లెలు కదులడం దేశంలోనే ఇదొక రికార్డు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గ్రామస్థులు సమావేశమై టీఆర్‌ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే విషయంపై సుదీర్ఘంగా సమాలోచనలు చేసి మరీ నిర్ణయం తీసుకొంటున్నారు.
వివిధ నియోజకవర్గాల్లో రెడ్డి, ఆర్యవైశ్య సంఘాలతోపాటు అనేక కులసంఘాలు, కార్మిక సంఘాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాయి. అంతటితో ఆగకుండా అనేక గ్రామాలు, కులసంఘాలు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్, ప్రచార ఖర్చులకోసం ఉడతాభక్తిగా విరాళాలు కూడా ఇస్తున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వంగపల్లి గ్రామం యావత్తూ టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలువాలని మొట్టమొదట నిర్ణయించింది. ఒక్క కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే దాదాపు 15 గ్రామాలు టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్నట్లు ప్రకటించాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 10 గ్రామాలు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామ ప్రజలు తమ నాయకుడు మంత్రి కేటీఆర్ గెలుపుకోసం తమ వంతుగా రూ.10 వేలు ఇచ్చారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలు టీఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకొన్నాయి.