రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై శనివారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బతుకమ్మ నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, ఖ్యాతిని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తం చేయనున్నామని సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.15 లక్షల చొప్పున ఇస్తామని, విదేశాల్లో నిర్వహించేందుకు రూ.2 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్య అతిథులు ఉండరని, ప్రజలు, అధికారులు స్వచ్ఛందంగా పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలో మొదటిసారిగా 12 ఏండ్లలోపు ఉండే బాలికలతో అక్టోబర్ 7 నుంచి 9 వరకు బొడ్డెమ్మ పండుగను నిర్వహించనున్నట్టు తెలిపారు.
9వ తేదీనుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ పండుగ జరుగుతుందన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా బ్రహ్మకుమారీలు, విదేశీ వ్యవహారాలశాఖ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మకుమారీలకు సంబంధించి 25 దేశాలకు చెందిన 75 మంది మహిళలు తెలంగాణలో బతుకమ్మ ఆడుతారని తెలిపారు. ఈ ఏడాది 1000 మంది కంటిచూపు లేని మహిళలు, బధిరులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా హైటెక్స్‌లో బతుకమ్మ నిర్వహిస్తున్నామని వివరించారు. 50 మంది పారామోటరింగ్ ద్వారా ఆకాశంలో బతుకమ్మ హరివిల్లు కనిపించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 12 దేశాల నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పించి అలంకరిస్తామని తెలిపారు.
విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో బతుకమ్మకు సంబంధించిన సాహిత్యం అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆయా దేశాల భారతీయ రాయబార సంస్థలకు లేఖలు రాశారని తెలిపారు. యూకే, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్, పోలండ్ లాంటి దేశాల్లో విదేశీ భారత మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేలా చూస్తామన్నారు. తమ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే దాదాపు 50 దేశాల నుంచి వినతులు వచ్చాయని చెప్పారు