దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, టీఆర్‌ఎస్సే మళ్లీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు.
శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బీమవరపు రాధిక, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీలకు చెందిన వెయ్యిమంది కార్యకర్తలు, వార్డు ప్రజలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ ఉతుత్తి హామీలు, కాంగ్రెస్ ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పాతరేసేందుకు టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆత్మక్షోభించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తాలేని పార్టీలన్నీ ఒక్కటైనా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని అందరూ చెప్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబు.. పొత్తులు పెట్టుకొని తెలంగాణకు అన్యాయం చేయాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.