గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అద్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాటుచేసింది. అదో ద్రోహ కూటమి. పాలమూ రులోని బీడు భూములను సస్యశ్యామలం చేయడం కోసం తలపెట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ను నిలిపేయమని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు కేంద్రానికి 30 లేఖలు రాశాడు. ఈ రోజు నాగర్‌కర్నూల్ గడ్డ నుంచి అడుగుతున్నా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలి. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మీద కత్తిదూస్తున్న వ్యక్తి కారణంగా పాలమూరు ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లు కాదా? మళ్లీ మన స్వాభిమానాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ల వద్ద పెట్టాలా.. అనేది ప్రజలు ఆలోచించాలి’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎన్నో కష్టాలు.. ఎందరో బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో అమరావతికి, ఢిల్లీకి కట్టు బానిసలుగా ఉండే వారికి ఓట్లు వేసి రాష్ట్రాన్ని ఆగం చేయవద్దని కోరారు. రాష్ట్రంలో పేద ప్రజానీకానికి ఎన్నో సంక్షేమ పథకాల ను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. గతంలో రూ.200 పింఛన్ ఇచ్చిన వారి నోటితోనే రూ.2 వేలు ఇస్తామని చెప్పించిన ఘనత కూడా టీఆర్‌ఎస్‌దే. వాళ్ల వాగ్దానాల చిట్టా చూస్తుంటే గతంలో ప్రభుత్వాలను నడిపారా అనే అనుమానం వస్తోంది. నోటికి ఎంత వస్తే అంత చెబుతున్నరు. కొందరు ఆర్థికవేత్తలతో సంప్రదిస్తే.. ఉత్తమ్ వాగ్దానాలు నెరవేరాలంటే దక్షిణ భారత్‌లోని రాష్ట్రాల బడ్జెట్ కలిపితే కూడా సరిపోదని చెప్పారు.
కాంగ్రెస్ పొరపాటున అధికారంలోకి వస్తే ఒక్క పాలమూరు నుంచే నలుగురైదుగురు సీఎం అభ్యర్థులు తెరపైకి వస్తారు. డీకే అరుణ, చిన్నారెడ్డి, రేవంత్, నాగంతో పాటు జైపాల్‌రెడ్డి కూడా లైన్లో ఉన్నారు. ఢిల్లీ నుంచి ఒక సీల్డు కవర్‌లో సీఎం దిగుతారు. 6 నెలలకొకరు చొప్పున మారుతారు. ఢిల్లీ నుంచి సీల్డు కవర్‌లో వచ్చే సీఎం కావాలో, రాష్ట్రం నుంచి వచ్చిన సింహం సీఎంగా ఉండాలో ఆలోచించుకోండి అని కేటీఆర్ తెలిపారు. ఈ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతి నిధి మందా జగన్నాథం, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.