కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఫలితంగా గురువారం ఉదయం ఆయన ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని రేవంత్ నివాసానికి ఐటీ బృందం చేరుకుని ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం.జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రెండు ఐటీ బృందాలు హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
ఆ సమయంలో రేవంత్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో.. అక్కడ ఉన్న సిబ్బందికి నోటీసులు ఇచ్చి దాడులు చేస్తున్నట్టు సమాచారం. వారి సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకుని స్విచ్చాఫ్ చేసి ఈ సోదాలకు దిగారు. ఇకపోతే, కొడంగల్‌లో ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రస్తుతం రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన భూపాల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. లెక్కా పత్రం లేని అక్రమ ఆర్థిక లావాదేవీలపై వారు ఫోకస్ చేసినట్టు సమాచారం.