నిర్మల్ పట్టణంలోని ఎన్టీయార్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన పద్మశాలి గర్జనలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉందని తెలిపారు. నేతన్న కుటుంబాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. నేతన్న బతుకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి వివరించారు.
వలస పాలనలో చేనేత, మరమగ్గాలను నమ్ముకొని బతుకుతున్న కుటుంబాల వారికి ఉపాధి లేక రోడ్డున పడ్డాయిని, తెలంగాణ రాష్ట్ట్ర ఆవిర్భావం తర్వాత వారి ఆర్థిక, జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి, పవర్‌లూం, చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుందన్నారు. నేతన్నలకు చేతినిండా పని కల్పించేందుకు చేనేత లక్ష్మి వంటి పథకాలతో పాటు ప్రతి ఏటా బతుకమ్మ పండుగ కానుకగా ఇస్తున్న చీరల నేతపనిని చేనేత సంఘాల వారికే ఇస్తున్న సంగతిని గుర్తు చేశారు.
ప్రతి నేతకార్మికుడికి నెలకు రూ.15 వేల వేతనం అందేలా పలు పథకాలతో ముందుకు వెళ్తుమన్నారు. కనీసం వారంలో ఒక్కరోజైనా చేనేత బట్టలు ధరించాలని మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని, రాజకీయంగానూ టీఆర్ఎస్ ఎందరో పద్మశాలీలకు పదవులిచ్చి గౌరవించిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పద్మశాలీలంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహానీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప వ్యక్తి అని, అలాంటి నాయకుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు.