అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని, దాడి 12 గంటలకు జరిగితే, సాయంత్రం వరకూ ఘటనాస్థలికి చేరుకోలేదనే ఆగ్రహంతో స్థానికులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. ఈ దాడి డుంబ్రిగూడ ఎస్ఐ అమర్‌నాథ్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో వారు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ కు నిప్పంటించి, ఫర్నీచర్ ధ్వంసం చేసి, పొలీస్ లపై దాడి చేశారు.
అయితే ఎమ్మెల్యే పర్యటనపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, అప్రమత్తంగా ఉండాలని ముందుగానే హెచ్చరించామని పోలీసులు చెబుతున్నారు. హత్య తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంలో డుంబ్రిగూడ ఎస్ఐ అమర్‌నాథ్ విఫలమయ్యారని ప్రాథమిక విచారణలో తేలడంతో వీరిపై వేటువేసినట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.
ఎమ్మెల్యే తన పర్యటన గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు నిర్లక్ష్యం వహించటం వల్ల సస్పెన్షన్ వేటు పడింది. అరకు ఘటనపై మూడు రోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ హత్యలను గిరిజన ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇది ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించారు. గిరిజన సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మన్యంలో రెండు రోజులు బంద్ కొనసాగుతోంది.