అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఈ దాడిలో ఎమ్మెల్యే చాతిలో నుంచి బుల్లెట్టు దూసుకెళ్లడంతో ఘటనాస్థలిలోనే ఆయన కుప్పకూలారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది.సర్వేశ్వర రావుకు రక్షణగా ఇద్దరు గన్ మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గన్ మెన్ ను మావోయిస్టులు పట్టుకుని వారిని చెట్టుకు కట్టేసి వారి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి అనంతరం టీడీపీలో చేరారు.
మావోయిస్టులు హిట్ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం.కాగా ఇది మహిళా మావోల దళం అని తెలుస్తోంది. తన క్వారీ మైనింగ్ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. గతంలోనూ పలుసార్లు కిడారిని మావోయిస్టులు బెదిరిస్తూ వచ్చారు.ఉన్నట్టుండి ఒక్కసారిగా మావోలు ఈ ఘాతుకానికి పాల్పడటంతో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు అలర్ట్గా ఉండాలని హోం శాఖ నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా స్థబ్దంగా ఉన్న మావోలు.. కిడారిని హత్య చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.హైదరాబాదులో ఉన్న డిజీపి ఆర్పీ ఠాకూర్ విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. సంఘటనా స్థలానికి గ్రేహౌండ్స్ దళాలు చేరుకుంటున్నాయి. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.