అభివృద్ధి అంటే ఏమిటో ఇవ్వాళ ప్రతిపల్లె, ప్రతి గడప చవి చూస్తున్నది. ఈ మార్గం ప్రజలకు బాగా నచ్చింది.ఈ పంథా నాలుగు కాలాలపాటు కొనసాగాలని జనం కోరుకుంటున్నారు. విధానాల కోసం, నిర్ణయాల కోసం, నిధుల కోసం, చివరికి నియామకాలకోసం ఢిల్లీకి ఎదురుచూసే వాళ్లు కాదు, సొంత చైతన్యంతో, ఆస్తిత్వకాంక్షతో అభివృద్ధిని ఉరకలు ఎత్తించాలని కోరుకునే అచ్చ తెలంగాణ నాయకత్వమే కావాలని తెలంగాణ కోరుకుంటున్నది. అందుకు కేసీఆరే సరైనవారని జనం భావిస్తున్నారు. నాలుగున్నరేళ్ల నాటి కంటే ఇవ్వాళ కేసీఆర్ ప్రబల శక్తిమంతుడు. జనం గుండెల్లో గూడుకట్టుకున్నవారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని చెప్పడం అంటే భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ వంటి వారల పాత్ర లేదని చెప్పడమే.
తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్పడం అంటే దేశానికి స్వాతం త్య్రం తెల్లోళ్లు ఇచ్చారని చెప్పడమే. అవును భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి కూడా బ్రిటన్ పార్లమెంటు చట్టం చేయాల్సి వచ్చింది. తెలంగాణకు స్వపరిపాలన ఇవ్వడానికి కూడా భారత పార్లమెంటు చట్టం చేయా ల్సి వచ్చింది. అప్పుడు తెల్లోళ్లయినా, మొన్న కాంగ్రెస్ అయినా తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి. దేశంలో అప్పు డు ఆ పరిస్థితి సృష్టించినవారు గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్‌లయితే, తెలంగాణలో మొన్న స్వరాష్ర్టాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి తీసుకువచ్చినవారు కేసీఆర్, ఇతర ఉద్యమశక్తులు. ఇప్పటి జాతీయ కాంగ్రెస్ నాయకత్వానికిగానీ, తెలంగాణ నాయకత్వానికి గానీ ఈ భాష అర్థం అయ్యే అవకాశమే లేదు. వారేనాడూ ఉద్యమాలు చేసింది లేదు. ఒక గొప్ప లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించడం కోసం జీవితాలను పణంగా పెట్టిన చరిత్ర ఇప్పటి కాంగ్రెస్‌లో ఒక్కరికయినా లేదు. వారెప్పటికీ తెలంగాణ ఎలా వచ్చిందో అర్థం చేసుకోలేరు. అర్థం అయినవారయితే ఇప్పుడీ భాష మాట్లాడరు.
తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్నా కాంగ్రెస్‌ను 2014 ఎన్నికల్లో ఎందుకు అంత చిత్తుగా ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోకుండా ఉండేవారు కాదు. భారత దేశం విషయంలో తెల్లోళ్లు ఎన్ని దుర్మార్గాలకు పాల్పడ్డారో తెలంగాణ విషయంలో ఆంధ్ర ఎస్టాబ్లిష్‌మెంటుతో కూడిన కాంగ్రెస్ అన్ని దుర్మార్గాలకు పాల్పడింది. 1950లలో ముల్కీ ఉద్యమకారులపై కాల్పులు జరుపడం, తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో విలీ నం చేయడం, పెద్దమనుషుల ఒప్పందాన్ని కాలరాయడం, తెలంగాణ నిధులు, ఉద్యోగాలు కొల్లగొట్టడం, ప్రత్యేక రాష్ట్రంకోసం 1969లో జరిగిన ఉద్యమాన్ని అతిదారుణంగా అణిచివేయడం, 374 మందిని కాల్చిచంపడం, తుదకు హైదరాబాద్‌ను ఒక ఆంధ్రా కాలనీగా మార్చడం వరకు కాంగ్రెస్ పాతకాలు లెక్కేలేవు. నీళ్లు లేక, కరెంటు లేక, వ్యవసాయం సంక్షోభంలో పడి వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కూడా కాంగ్రెస్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంల నిర్వాక పాలనలోనే.
ఆంధ్ర ఆధిపత్యానికి గొడుగుపట్టి తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీలు. తెలంగాణ ఆరు దశాబ్దాలు అనుభవించిన అన్ని కష్టాలకు, క్షోభలకు మూలకారణం కాంగ్రెస్, టీడీపీలు. ఎంతో దూరం ఎందుకు- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ ఎన్నికల ఒప్పందం చేసుకుని అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాని కి ఎంత ద్రోహం చేశారో అందరికీ తెలుసు. అప్పుడు ఇప్పటి కాంగ్రెస్ నాయకులు ఏ అధికార దర్బారుల్లో, ఏయే పదవుల్లో, ఏయే కిరీటాలు పెట్టుకుని రాజశేఖర్‌రెడ్డికి దాస్యం చేస్తూ వచ్చారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డి అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు భయం అనుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కాలంలోనూ ఇప్పటి కాంగ్రెస్ నేతలంతా మంత్రి పదవు లు తీసుకుని కుక్కిన పేనుల్లా పడి ఉన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి అనే ఒక అజ్ఞాని తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో కూర్చుని అవాకులు చవాకులు పేలుతుంటే ఇవ్వాళ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దమనుషులెవరూ మం త్రి పదవులను వదలి రాలేదు. కనీసం నిరసన ప్రకటనలు కూడా చేయలేదు. గడ్డాలు, మీసాల మీద ఇవ్వాళ ప్రతిజ్ఞలు చేస్తున్నవారికెవరికీ ఆ రోజు రోషం పుట్టుకురాలేదు. తెలంగాణ ఆత్మగౌరవం పొడుచుకురాలేదు.ఎంచక్కా అధికార కార్యకలాపాల్లో ముని గి తేలారు. ఫైళ్లు ఆమోదింపజేసుకునే పనిలో ఉండిపోయారు. వీళ్లిలా ఉన్నప్పుడు తెలంగాణ సమాజం ఏం చేస్తూ ఉంది- తెలంగాణ ఉద్యమ పతాకం కిందపడకుండా చేతిలో చెయ్యేస్తూ వీధి పోరాటాలు చేస్తూ ఉంది. కేసీఆర్ స్వయంగా దీక్షకు పూనుకుని మృత్యుముఖం వర కూ వెళ్లి మొత్తం శాసనవ్యవస్థను కదిలించి తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను సాధించారు. ఇదే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల కుట్రల ఫలితంగా సాధించుకున్న స్వేచ్ఛా ప్రకటనపై కేంద్రం వెనుకకు పోయినప్పుడు కేసీఆర్ సారథ్యం లో స్వచ్ఛంద ప్రజాగర్జనలు, సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం.. ఒకటేమిటి, సకల ఉద్యమరూపాలు తెలంగాణ నినాదాన్ని నెత్తికెత్తుకుని ఊరేగింపు చేశాయి. తెలంగాణ స్వేచ్ఛాకాంక్షను చివరి నిమిషందాకా రాజకీయ లక్ష్యంగా చేసుకుని కొట్లాడి, సాధించినవారా? లేక చివరి నిమిషం దాకా అధికార సౌధాల్లో పనులు, పైరవీల్లో మునిగి తేలినవారా? ఎవరు తెలంగాణ సాధకులు?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడంలో తెరవెనుక సైంధవ పాత్ర పోషించినవారిలో అనేక మం ది ఉన్నారు. గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్, వీరప్పమొయిలీ, ప్రణబ్‌ముఖర్జీ వీరందరూ ఏదో ఒక కమిటీకి నాయకత్వం వహించి తెలంగాణ డిమాండును దాటవేసినవారే. వీరందరికీ తెలంగాణ ఉద్యమం అంటే చాలా చిన్నచూపు. తెలంగాణ నాయకత్వం అంటే చులకన భావం. ఒక్క తెలంగా ణ ఉద్యమమే కాదు, ఏ ఉద్యమమన్నా వీరికి చిన్న చూపే. ప్రజలు ఉద్యమాలు చేయకుండా, రక్తం చిం దించకుండా కాంగ్రెస్ మెహర్బానీతో ఏర్పాటైన ఒక్క రాష్ట్రం చూపించండి దేశంలో. చివరకు కేసీఆర్ చెప్పినట్టు ఒక్క సోనియాగాంధీనే తుదకు బలమైన నిర్ణయం తీసుకుని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నడిపించింది. అనేక అనివార్యతల మధ్య. అప్పటికే పార్లమెంటులోని మెజారిటీ రాజకీయపక్షాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లిఖితపూర్వకంగా ఆమోదా లు తెలిపి ఉన్నందున పునర్విభజన చట్టం అమోదానికి నోచుకుంది. మిగిలిన కాంగ్రెస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అంతా ఆంధ్రా నాయకత్వం కనుసన్నల్లో తెలంగాణకు ద్రోహం చేయడానికే ప్రయత్నించింది. చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయని సామెత. తెలంగాణ కాంగ్రెస్ తాము చేసిన తప్పులేమిటో ఇప్పటికీ గుర్తించలేదు.
తెలంగాణ ప్రజల ముందు చెంపలేసుకోలేదు. బుకాయింపులు, దబాయింపులు, అబద్ధా ల ప్రచారం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజలను వం చించాలని చూస్తున్నది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. కేసీఆర్ అవసరం ఏమిటో ఈ నాలుగున్నరేళ్లలో ప్రజలు బాగా గుర్తించారు. స్వయం పాలన ఫలాలు ఎలా ఉంటాయో తెలంగా ణ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. అభివృద్ధి అంటే ఏమిటో ఇవ్వాళ ప్రతిపల్లె, ప్రతి గడ ప చవి చూస్తున్నది. ఈ మార్గం ప్రజలకు బాగా నచ్చింది. ఈ పంథా నాలుగు కాలాలపాటు కొనసాగాలని జనం కోరుకుంటున్నారు. విధానాల కోసం, నిర్ణయాల కోసం, నిధుల కోసం, చివరికి నియామకాలకోసం ఢిల్లీకి ఎదురుచూసే వాళ్లు కాదు, సొంత చైతన్యంతో, అస్తిత్వకాంక్షతో అభివృద్ధిని ఉరకలు ఎత్తించాలని కోరుకునే అచ్చ తెలంగాణ నాయకత్వ మే కావాలని తెలంగాణ కోరుకుంటున్నది. అందుకు కేసీఆరే సరైనవారని జనం భావిస్తున్నారు.
నాలుగున్నరేళ్ల నాటి కంటే ఇవ్వాళ కేసీఆర్ ప్రబల శక్తిమంతుడు. జనం గుండెల్లో గూడుకట్టుకున్నవారు. అప్పట్లో అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా పాదుకోలేదు. ఆ ఎన్నికల్లో 34 శాతం ఓట్లతో 63 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చా రు. ఇవ్వాళ ఏ నియోజకవర్గానికి వెళ్లినా టీఆర్‌ఎస్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇవ్వాళ గులాబీ జెండా ఎగురని చోటు లేదు. ఏ సర్వేలు చూసినా, ఎవరి అంచనాలు విన్నా ఇవ్వాళ టీఆర్‌ఎస్‌కు ఏ నియోజకవర్గంలోనైనా 45 శాతానికి తక్కువగా ఓట్లు రావడంలేదు. సగటున 45 శాతం తెచ్చుకున్న పార్టీలు ఎన్నికల చరిత్రలో 85 నుంచి 90 శాతం సీట్లు గెల్చుకున్న సందర్భాలు అనేకం. ఇప్పుడు టీఆర్‌ఎస్‌దీ అదే ఊపు.