మహానగరంలో అతిపెద్ద సామూహిక వేడుక వినాయక శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది.11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో ఇవాళ ఆ వేడుకకు మరోసారి రెడీ అయ్యింది.నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఆదివారం నగరం నలువైపుల నుంచి వైభవంగా ప్రారంభం కానున్న గణనాథుడి శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాయిశోభా యాత్ర సాఫీగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేశాయి.
విగ్రహాల నిమజ్జనానికి 200కు పైగా క్రేన్లు సిద్ధం చేశారు.. నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు,92 సంచార మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. తాగునీరు అందించేందుకు గాను జలమండలి ద్వారా 101 నీటి శిబిరాల ద్వారా 30 లక్షల నీటి ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. మరోవైపు శోభాయాత్ర సందర్భంగా ట్యాంక్‌బండ్ చుట్టూ సుమారు 30 వేల మంది పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖలు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గంలో నిమజ్జన వేడుకలు ముగిసి, భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్లేవరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ సహా జిల్లాల్లో జరిగే గణేశ్ నిమజ్జనాన్ని రాజధాని నుంచే సమీక్షించాలని డీజీపీ మహేందర్ రెడ్డి నిర్ణయించారు. అన్ని చెరువులు, కాలువల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దానిని డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు.
వేలాది మంది పోలీసులను మోహరించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించగా మరికొన్ని చోట్ల దారి మళ్లిస్తున్నారు.