తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని శివసాయి ఫంక్షన్ హాలులో జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేదోళ్ల ముఖంలో చిరునవ్వులు కనిపించాలంటే మరోసారి తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని, గెలిస్తే ఇంతకు పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. తొలిసారి 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా 171 ఓట్ల మెజార్టీ తో బయటపడ్డానని, ఇప్పుడు కార్యకర్తలు లక్ష మెజార్టీని అందిస్తామంటుంటే ఐదేళ్లలో జరిగిన మార్పు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
కాంగ్రెస్ కు ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేకపోవడం వల్లే ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి గులాంనబీ ఆజాద్ మాట్లాడే మాటలు ఆయనకే అర్థం కావడం లేదని, తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్ పాత్ర లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్, కేసీఆర్ అన్న మూడు అక్షరాల ద్వారానే తెలంగాణ వచ్చిందని మంత్రి గుర్తుచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇస్తున్న హామీలు నెరవేరాలంటే దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో గులాబీ జెండా ఎగురకపోతే రాష్ట్రం ఈరోజు ఇలా ఉండేదా అని ఆయన ప్రశ్నించారు.
టీపీసీసీ పదవి కూడా తెలంగాణ, కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పది జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని, కేసీఆర్ నాయకత్వాన్నే మళ్లీ కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ప్రజలంతా స్వచ్చందంగా టీఆర్‌ఎస్ పార్టీకే మా ఓటు అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు అంటే దానికి కారణం టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి అని తెలిపారు.