ఇంటింటికీ సెట్‌టాప్ బాక్సుల పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా టీడీపీ సర్కారు మరోసారి అప్పుల భారం మోపింది. పది లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే రెండు విడతలుగా రూ.711 కోట్ల అప్పునకు గ్యారెంటీ ఇచ్చింది. తాజాగా 68 లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు కోసం ఏకంగా రూ.3,283 కోట్ల అప్పు చేసేందుకు గ్యారెంటీ ఇస్తూ ఈనెల 10వ తేదీన జీవో 27 జారీ చేసింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో ప్రతి ఇంటికి కొత్తగా సెట్‌టాప్ బాక్సులను సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్కెట్‌లో నాణ్యమైన సెట్‌టాప్ బాక్సు ధర రూ.1,200 నుంచి రూ.1,500 మాత్రమే సర్కారు మాత్రం వీటి ధరను ఒక్కొక్కటి ఏకంగా రూ. 4 వేలుగా నిర్దేశించింది వడ్డీ భారం అదనం చేసింది. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన టెరా సాఫ్ట్‌వేర్ సంస్థకు కట్టబెట్టడం గమనార్హం.
ఫైబర్ గ్రిడ్ పేరుతో విద్యుత్ స్తంభాల వెంట ఆప్టికల్ లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ సెట్‌టాప్ బాక్సుల ద్వారా ప్రసారాలు అందించాలని నిర్ణయించారు. సెట్‌టాప్ బాక్సులను అమర్చుకోవడం ద్వారా కేవలం రూ.149కే టీవీ ప్రసారాలతోపాటు వైఫై, ఫోన్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటికే వీటిని తీసుకున్న వారు ప్రసారాలు రాకపోవడం, అన్ని చానల్స్ రాకపోవడం, ఆన్ చేసిన ఐదు నిముషాలకుగానీ టీవీ రాకపోవడం తదితర కారణాలతో సెట్‌టాప్ బాక్సులను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారు.ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా చైనా నుంచి దిగుమతి చేసుకున్న సెట్‌టాప్ బాక్సులను చైన్నె పోర్టులో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ బాక్సుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం లేవని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దేశ భద్రతాపరంగా ఈ బాక్స్‌లు ప్రమాదకరమనే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తమైంది.
సెట్‌టాప్ బాక్సులు ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని ప్రజలకే వదిలేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి మరీ ప్రతి ఇంటికీ అంటగట్టాల్సిన అవసరం ఏమిటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇళ్లకు మంచినీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రహదారుల నిర్మాణం లాంటి మౌలిక అవసరాల కోసం సర్కారు అప్పులు చేస్తే ఏమైనా అర్థం ఉంటుందని, అప్పులు చేసి మరీ సెట్‌టాప్ బాక్సులను పంపిణీ చేయాలని నిర్ణయించడం వెనుక భారీ మతలబున్నట్లు బోధపడుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.