టీఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత గురువారం జగిత్యాల లోని హనుమవాడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. వివిధ వార్డులకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలతోపాటు వివిధ పార్టీల నాయకులు ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ జెండా అంటే బాధ్యతకు మారుపేరు, జెండాను పట్టుకున్న కార్యకర్తలు అందరూ క్రమ సైనికుడిలా పనిచేసి, సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌కు గ్రామాల్లో అఖండమైన ప్రజాదరణ ఉందని వారే స్వఛ్ఛంగా పార్టీని గెలిపిస్తారని తెలిపారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందిచతమే టీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యం అని పేర్కొన్నారు. చరిత్రలో ఏనాడూ రానన్ని నిధులను 2014 నుంచి జగిత్యాల అభివృద్ధికి మంజూరు చేశామన్నారు. డబుల్ బెడ్‌రూం పథకం కింద జగిత్యాలకు 1,400 ఇండ్లు మంజూరు చేశారన్నారు. డబుల్ ఇండ్ల మంజూరు బాధ్యతలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి అప్పగించగా, కేవలం 400 ఇండ్లను మాత్రమే మంజూరు చేశారనీ, రెండో దశలో ఇచ్చిన వెయ్యి ఇండ్లకు మంజూరు చేయలేదని ఆరోపించారు.
డబుల్ ఇండ్ల మంజూరులో జీవన్‌రెడ్డి వైఖరిలో మార్పురాకపోవడంతో సీఎం కేసీఆర్‌ను కలిసి రూ.212 కోట్లతో 4,160 డబుల్ బెడ్రుం ఇళ్ళు కేటాయించుకున్నామని తెలిపారు. టెండర్లు పూర్తి కావడంతోపాటు 1,500 ఇండ్లు రూపుదిద్దుకున్నాయని తెలిపారు. లబ్ధిదారులకు డిసెంబర్ లోగా అందజే స్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలోనే రూ.50 కోట్లు కేటాయించామని, మరో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నీటి సరఫరా అందిస్తామన్నారు.
ఒకవైపు అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని కోరుకునే సీఎం కేసీఆర్ మరోవైపు తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు, కాంగ్రెస్ నేత ఉత్తమ్ ఉన్నారన్నారు. ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే రైతుబీమా, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు .. వస్తాయన్నారు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్‌ను గెలిపించి , జగిత్యాలలో గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.