తెలంగాణలో టీఆర్‌ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ఈ విషయంలో తాను బెట్ కడుతున్నానని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. గురువారం ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు. అభివృద్ధి విషయానికొస్తే దేశం మొత్తంలోనే తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు. సంక్షేమరంగానికి దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత ఎక్కువ ఖర్చుచేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 119 సీట్లు ఉండగా.. అందులో 105 స్థానాలకు అభ్యర్థులను సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారని తెలిపారు.
ఎంఐఎంకు తమకు ఫ్రెండ్లీ పార్టీగా కేసీఆర్ అభివర్ణించారని.. ఇతర పార్టీల్లోని నేతలెవరికీ ఆ స్థాయి లేదని స్పష్టం చేసిన ఎంఐఎం చీఫ్… సర్కారును రద్దుచేసి ముందస్తుకు పోవాలంటే ఎంతో గుండెధైర్యం కావాలని…. కేసీఆర్ ఒక్కరికే సాధ్యమన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలకు అందించిన సుపరిపాలనే… టీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపించి తీరుతుందన్న ఆయన… తమకు పదవుల మీద ఎప్పుడు ఆశ లేదని… మైనార్టీలు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమమే తమ ఎజెండా అన్నారు… అందుకే తాము టీఆర్ఎస్‌కు మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణలో మైనారిటీలకు చెందిన 206 గురుకులాల్లో దాదాపు 50 వేల మంది ముస్లిం బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. షాదీముబారక్ పథకం ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతున్నదన్నారు. ఇలాంటి పథకాలు ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చుతాయని, అందుకే టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా చెప్తున్నానన్నారు. తాము పోటీ చేయని నియోజకవర్గాల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉంటారని, ఈ విషయాన్ని తాము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. ఎందుకంటే నాలుగేండ్లలో తెలంగాణలో ఎక్కడా మతకలహాలు జరిగిన దాఖలాల్లేవని గుర్తుచేశారు.