ముస్లింలు నూతన సంవత్సరం ప్రారంభ మాసంగా మొహర్రంను పరిగణిస్తారు. మహ్మద్ ప్రవక్త కూడా ఇదే విధానాన్ని అమలులో ఉంచారు. అసలు మహ్మద్ ప్రవక్త సమాజానికి, విశ్వాసాలకు ఉపకరించే ఏ పాత పద్ధతులనూ మార్చలేదు. సమాజ వికాసానికి దోహదపడే విధానాలు, పద్ధతులను స్వయంగా ఆచరించారు.పూర్వం నుంచే ఈ విధానం ఉంది. ఇది ఒక పవిత్ర దినంగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఇస్లాం మతం క్యాలెండర్ తొలి నెల మొహర్రం 10వ రోజు షహాదత్‌ను పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లింలు మొహర్రంను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇస్లాం మత చివరి ప్రవక్త మహ్మద్ ముస్తఫా సల్లెల్లాహు అలైహివహ సల్లం మనుమలు ఇమామ్ హసన్, ఇమామ్ హుస్సేన్ త్యాగాలు, బలిదానాలను స్మరించుకుంటూ ఒక వైపు దుఖసాగరంలో మునిగిపోయి, మరో వైపు ధార్మికతను ప్రదర్శిస్తూ ముస్లింలు మొహర్రంను జరుపుకొన్నారు.
ఇస్లామియా చరిత్రలో మొహర్రం మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మొహర్రం మాసం పదో తేదీని ఆషూరా అంటారు. చరిత్రలో ఈ తేదీకి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఆదిమానవుడైన ఆదం ఆలైహిస్సలాంను దైవం సృష్టించింది, స్వర్గానికి పంపించింది ఆషూరా రోజునే. నోవా (నూహ్) ప్రవక్త నావను కనివిని ఎరగని భయంకర తుఫాన్ నుంచి రక్షించి, దైవం ఒడ్డుకు చేర్చింది ఈరోజే. యూనుస్ ప్రవక్తను చేప కడుపు నుంచి రక్షించింది కూడా ఈ రోజే. ఇబ్రహీంను నమ్రూద్ రాజు అగ్నిగుండంలో పడేసినప్పుడు దైవం ఆయన్ని అగ్ని నుంచి కాపాడాడు. మోషే ప్రవక్త, అనుయాయులను అష్టకష్టాలకు గురిచేసిన రాజు ఫిరోన్’(ఫారో) బారి నుంచి రక్షించాడు. దీనికి కృతజ్ఞతగా మోజెస్ ప్రవక్త అనుయాయులు (యాదులు) ఆ రోజు ఉపవాసం ఉండేవారు. మహ్మద్ ప్రవక్త రెండు రోజులు ఉపవాసం పాటించాలని బోధించారు. అంటే 9, 10వ తేదీల్లో గానీ 10, 11వ తేదీల్లో గానీ ఉపవాస వ్రతం పాటించాలి. ఈ రెండు ఉపవాసాలు పాటించిన వారి గత పాపాలన్నీ దైవం క్షమిస్తాడు. మహ్మద్ ప్రవక్త(స) బోధనలతో ముస్లింలంతా పునీతులయ్యారు.
మొహర్రంను పురస్కరించుకొని చారిత్రాత్మక బీబీకా అలవా నుంచి శుక్రవారం జరిగే ఊరేగింపునకు వివిధ విభాగాల ద్వారా తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఊరేగింపు కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దాదాపు రూ.3 కోట్లతో రోడ్ల మరమ్మతులు, అదనపు లైటింగ్, నూతన రోడ్ల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. బీబీకా ఆలం ఊరేగింపు మార్గంతో పాటు అన్ని అషూర్‌ఖానాల మార్గంలో రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం తదితర పనులతో పాటు అదనంగా 95 మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.