శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలూ పనిచేసే పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక కోస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి పోలీసు అధికారుల సంఘం నాయకులు హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్ విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాజకీయ నాయకులు అదుపుతప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుండడం బాధాకరమన్నారు. కొంతమంది రాజకీయ నేతలు పోలీసు వ్యవస్థను డిఫెన్స్‌లో పడేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంత వరకూ సంయమనం పాటించామని.. ఇకనుంచి ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పోలీసులపై మాట్లాడితే కొమ్ములొస్తాయని భావిస్తే సహించబోమన్నారు. నాయకుల మాటలతో ఇళ్లలో భార్య, పిల్లలకు మొహాలు చూపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఉద్దేశించి కొజ్జాలు అని వ్యాఖ్యానించారని, మొగోళ్లమైనందునే పోలీసు వ్యవస్థలోకి వచ్చామని స్పష్టం చేశారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి పోలీసులపై నోరు జారితే నాలుక కోస్తామని పోలీస్ సంఘం హెచ్చరించింది. తాడిపత్రి ఘటనతో పాటు ఇటీవల పలు సందర్భాల్లో ఎంపీ జేసీ పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్రంగా స్పందించారు. పోలీసులను హిజ్రాలతో పోలుస్తూ ఎంపీ జేసీ చేసిన వాఖ్యాలనుద్దేశించి సిఐ గోరంట్ల మాధవ్ తాము మగాళ్లమంటూ మీసం తిప్పారు. నిరంతరం ప్రజల రక్షణ కోసం కష్టపడుతున్న తమను కించపరిచేలా ఇంత సీనియర్ నాయకుడు మాట్లడటం ఏంటని ప్రశ్నించారు. జేసీ పై కేసు నమోదు చేసే అంశాన్ని ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోసారి పోలీసుపై అవాకులు, చవాకులు పేలితే తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.