కాంగ్రెస్ పార్టీలో కొత్త కలకలం నెలకొంది. పీసీసీ కమిటీలపై అసంతృప్తుల జ్వాల రగులుతోంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డికి పదవులు కట్టబెట్టడం నేతలు భగ్గమంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.నిన్న మొన్న పార్టీలలో చేరి జైలు కు వెళ్లివచ్చిన నాయకులకు కూడా పెద్ద పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బలంగా ఉన్న వారికి అన్యాయం జరిగిందని, గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెడితే పార్టీ అధికారంలోకి రాదన్నారు.
హైదరాబాద్ నగరశివారులోని అంబర్ పేటలో జరిగిన ఓ సమావేశంలో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యానించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని వారికి కమిటీలో ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ప్రజల్లో ఉండే తమని కమిటీలో ఎక్కడో పెట్టారని, కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కుంతియా మాకు శనిలా దాపురించాడని, వంద మంది కుంతియాలు వచ్చినా భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్లే 2014 లో ఓడిపోయామని వ్యాఖ్యానించారు.